బాధితుల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశం
డ్రంక్ అండ్ డ్రైవ్ నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ఆదిలాబాద్, జూన్ 25 మన భారత్:
ఆదిలాబాద్ జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను జిల్లా పోలీసు అధికారి (ఎస్పీ) అఖిల్ మహాజన్, ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. పోలీసు స్టేషన్‌లో ప్రజలకు అందుతున్న సేవలు, కేసుల దర్యాప్తు పురోగతి, రికార్డుల నిర్వహణ, చట్ట అమలు తీరును సమగ్రంగా పరిశీలిస్తూ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా స్టేషన్‌లోని రిసెప్షన్ విభాగం, కోర్టు డ్యూటీ నిర్వహణ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాల నిర్వహణ, స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసుల ఫైళ్లు, స్టేషన్ ఆవరణలో నిల్వ ఉంచిన వాహనాల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి అంశంపై అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు.
స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వారి ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా చట్టబద్ధంగా పరిష్కరించాలని ఎస్పీ స్పష్టం చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించిన ఎస్పీ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగించాలని చెప్పారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని, ప్రజల్లో పోలీసులపై విశ్వాసాన్ని మరింత పెంచే విధంగా సిబ్బంది సేవలందించాలని ఎస్పీ సూచించారు. ప్రజా సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరిస్తూ సమర్థవంతమైన పోలీసింగ్ అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఇతర పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
