మన భారత్, ఆదిలాబాద్
డా. శ్యామలపై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల ఐక్య వేదిక డిమాండ్:
భోరాజ్ మండలం మండగడ గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ ఇట్టడి వాణిశ్రీ శ్రీరామ నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు అల్లూరి భూమన్న డిమాండ్ చేశారు.
గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే వాణిశ్రీ ప్రాణాపాయ స్థితికి చేరుకుందని ఆరోపించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం కోసం నాగపూర్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సంబంధిత వైద్యులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రీరామ నర్సింగ్ హోమ్‌పై సమగ్ర విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
వైద్య నిర్లక్ష్య ఘటనపై స్వతంత్ర సంస్థ ద్వారా విచారణ చేపట్టాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించాలని అల్లూరి భూమన్న విజ్ఞప్తి చేశారు. బాధితుల తరఫున మాట్లాడిన నాయకులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోని పక్షంలో దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు అగ్గిమల్ల గణేష్, దర్శనాల నగేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఇజ్జగిరి సంజయ్, పెంటపర్తి ఉషన్న, నాందేవ్ కాంబ్లీ, ఎల్మల నగేష్, నాతర రమేష్, దర్శనాల అశోక్, నక్క రాందాస్, మల్లెల మనోజ్, ప్రసన్న, గంగన్న, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
