e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై రాజకీయాలు చేయడం వైసీపీకి అలవాటు

బాధిత కుటుంబాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి లేదు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విశాఖ ఉక్కు పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

మన భారత్, అమరావతి:

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న దుర్ఘటన బాధాకరమైనదేనని, అయితే ఆ ఘటనను కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. బుధవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన క్షణం నుంచి కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస్ వర్మ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్‌తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారని తెలిపారు.

మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన సహాయ చర్యలను వివరించిన మంత్రి, శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 కోట్ల పరిహారం, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం అందించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం, నివాస సౌకర్యం, పిల్లల విద్యాభ్యాసానికి అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

బాధిత కుటుంబాలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ విషయంలో కూడా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగిని కూడా తొలగించకపోయినా వేలాది ఉద్యోగాలు తొలగించారంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున చెక్కులు అందజేసినా ప్రభుత్వం సహాయం చేయలేదని ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు.

ఎల్జీ పాలిమర్స్ ఘటనను గుర్తు చేసిన మంత్రి

ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది మరణించినప్పటికీ, అప్పటి జగన్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పూర్తిస్థాయి న్యాయం చేయలేదని మంత్రి ఆరోపించారు. కంపెనీ ద్వారా కొంతమందికి మాత్రమే పరిహారం అందించి చేతులు దులుపుకుందని విమర్శించారు. బాధితులను కూడా ఎయిర్‌పోర్ట్‌కు పిలిపించి మాట్లాడటం జగన్ వ్యవహార శైలికి నిదర్శనమని పేర్కొన్నారు.

స్టీల్ ప్లాంట్‌పై జగన్ వైఖరిని ప్రశ్నించిన మంత్రి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పిన జగన్, అదే సమయంలో పోస్కో సంస్థతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్చలు జరపలేదా అని మంత్రి ప్రశ్నించారు. గతంలో స్టీల్ ప్లాంట్ ప్రాంతంలో రాజధాని నిర్మాణం గురించి చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు.

95 శాతానికి చేరిన ఉత్పత్తి..

విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి కేంద్రం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం అందించిందని మంత్రి తెలిపారు. ముడి సరుకు కొనుగోలుకు రూ.4 వేల కోట్లు, ప్లాంట్ ఆధునీకరణకు రూ.5 వేల కోట్లు వినియోగించినట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో 30 శాతానికి పడిపోయిన ఉత్పత్తి ప్రస్తుతం 95 శాతానికి చేరుకుందని, నెలకు 6 లక్షల టన్నులకుపైగా ఉత్పత్తి జరుగుతోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించేందుకు ప్రత్యేక చొరవ చూపారని, ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించి ప్రైవేటీకరణను అడ్డుకోవడంతో పాటు ఆర్థిక సహాయం అందేలా కృషి చేశారని మంత్రి తెలిపారు.

బాధిత కుటుంబాల పట్ల సానుభూతి చూపకుండా రాజకీయ విమర్శలు చేయడం ప్రతిపక్షానికి తగదని, ప్రజా సమస్యల విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE