e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ఆరు వరుసల వంతెనకు గ్రీన్ సిగ్నల్..

మన భారత్, హైదరాబాద్

కాటేదాన్–శంషాబాద్ మార్గంలో ఆరు లేన్ల వంతెనకు గ్రీన్ సిగ్నల్

రూ.189.68 కోట్లతో గ్రేడ్ సెపరేటర్ నిర్మాణం.. విమానాశ్రయానికి రాకపోకలు మరింత సులువు

హైదరాబాద్, జూన్ 5: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాటేదాన్ జంక్షన్, మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్ మీదుగా రూ.189.68 కోట్ల వ్యయంతో ఆరు లేన్ల ద్విముఖ గ్రేడ్ సెపరేటర్ (ఫ్లైఓవర్) నిర్మాణానికి ఆమోదం లభించింది.

టెండర్ ప్రక్రియ పూర్తికాగా, నిర్మాణ సంస్థ ఎంపికకు అనుమతి ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (హెచ్-సిటీ) కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు.

నగరంలోని ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించి, వాహనదారులకు సిగ్నల్‌లేని ప్రయాణ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సులభమైన రాకపోకలు ఉండేలా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది.

ఇప్పటికే హెచ్-సిటీ కింద కేబీఆర్ పార్క్ జంక్షన్, ఫాక్స్ సాగర్ బ్రిడ్జి, గచ్చిబౌలి ఐఐఐటీ జంక్షన్ ప్రాంతాల్లో వంతెనల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే పంజాగుట్ట ఎన్‌ఎఫ్‌సీఎల్ జంక్షన్, అల్విన్ కాలనీ, రసూల్‌పుర జంక్షన్ల వద్ద కూడా ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంస్థలను ఎంపిక చేశారు.

కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు బాధ్యతలు

ఈ ప్రాజెక్టు కోసం రెండు సంస్థలు టెండర్లు దాఖలు చేయగా, కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ రూ.189.68 కోట్లతో (అంచనా వ్యయంపై 4.71 శాతం అధికంగా), ఎన్‌సీసీ లిమిటెడ్ రూ.189.88 కోట్లతో (4.82 శాతం అధికంగా) బిడ్‌లు సమర్పించాయి.

సాంకేతిక, ఆర్థిక బిడ్‌ల పరిశీలన అనంతరం ఎల్-1 బిడ్డర్‌గా నిలిచిన కేఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌ను ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. హెచ్-సిటీ నిధులతో ప్రాజెక్టును అమలు చేసి, త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించింది.

విమానాశ్రయ ప్రయాణం మరింత వేగవంతం

ఈ ఫ్లైఓవర్ పూర్తయిన తర్వాత ఫలక్‌నుమా, బహదూర్‌పురా, బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, సంతోష్‌నగర్, మిధాని, సైదాబాద్, ఐఎస్ సదన్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణం మరింత సులభం కానుంది. అలాగే కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు గణనీయమైన ఉపశమనం లభించే అవకాశం ఉంది.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE