చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
అధ్యక్షుడిగా శీలపాక ప్రణీత్ కుమార్ ఎన్నిక
మన భారత్, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన చిట్యాల ప్రెస్ క్లబ్–2 నూతన కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. గౌరవ అధ్యక్షులు కట్కూరి మొగిలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో పలు పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. జర్నలిస్టుల ఐక్యత, సంఘ బలోపేతం లక్ష్యంగా నూతన కమిటీ ఏర్పాటైనట్లు సభ్యులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా శీలపాక ప్రణీత్ కుమార్ ఎన్నిక కాగా, ఉపాధ్యక్షులుగా జీడి సురేష్, ప్రధాన కార్యదర్శిగా నేరెళ్ల ఓదెలు, కోశాధికారిగా పాముకుంట్ల చందర్, సహాయ కార్యదర్శిగా చింతల అశోక్, ప్రచార కార్యదర్శిగా కట్కూరి రాజు ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా గుర్రపు తిరుపతి, మైదం మహేష్, జన్నె యుగేందర్, చింతల కృష్ణస్వామి, శ్రీకాంత్ ఎంపికయ్యారు.
నూతన కమిటీ ఎన్నికల సందర్భంగా సభ్యులు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు. జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి గౌరవం, ఐక్యత కోసం కమిటీ పనిచేయాలని పలువురు సభ్యులు ఆకాంక్షించారు. చిట్యాల ప్రాంతంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు శీలపాక ప్రణీత్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష పదవికి ఎన్నుకున్న ప్రెస్ మిత్రులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను గౌరవంగా స్వీకరించి నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ అనేది సమాజానికి కళ్ళు, చెవులు, గొంతుగా పనిచేసే శక్తి అని పేర్కొన్నారు.
ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే వారధిగా మీడియా వ్యవస్థ ఉండాలని ఆయన అన్నారు. సమాజంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే మౌనం వహించకుండా నిజం కోసం నిర్భయంగా నిలబడతానని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ జర్నలిస్టుల గౌరవాన్ని కాపాడేందుకు కృషి చేస్తానన్నారు.
ప్రెస్ మిత్రులందరినీ ఐక్యంగా తీసుకుని చిట్యాల ప్రెస్ క్లబ్–2ను మరింత బలంగా, గౌరవప్రదంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని శీలపాక ప్రణీత్ కుమార్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు యువ విలేకరులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమాలను కూడా నిర్వహించాలని సంకల్పం వ్యక్తం చేశారు.
జర్నలిజం ప్రజాస్వామ్యానికి నాల్గవ స్థంభమని, సమాజంలో జరుగుతున్న సమస్యలను ప్రజల ముందుకు తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని పలువురు సభ్యులు పేర్కొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ మరింత చురుకుగా పనిచేస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రెస్ మిత్రులు, స్థానిక జర్నలిస్టులు, సంఘ సభ్యులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
