e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

తీయటి మాటల ముసుగులో సైబర్ మోసం..

మన భారత్, హైదరాబాద్: 

ఇటీవల సోషల్ మీడియాలో ఆకర్షణీయ ప్రకటనల రూపంలో యువతను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు హెచ్చరికలు వెల్లువెత్తుతున్నాయి. “ఒంటరిగా ఉన్నారా? అందమైన అమ్మాయిలతో చాట్ చేయండి” అంటూ కనిపిస్తున్న యాడ్స్ వెనుక ప్రమాదకరమైన సైబర్ ఉచ్చు దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ప్రకటనలు యువతలోని ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని రూపొందించిన హనీట్రాప్ పద్ధతిగా గుర్తించారు. వీడియోల్లో కనిపించే మహిళలు నిజమైన వారు కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో సృష్టించిన ఫేక్ వీడియోలేనని వెల్లడిస్తున్నారు.

ఇలాంటి లింక్‌ల ద్వారా యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకుంటే, వినియోగదారుల ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు, వ్యక్తిగత డేటా మొత్తం హ్యాకర్లకు అందుబాటులోకి వెళ్లే ప్రమాదం ఉంది. అనంతరం వీడియో కాల్‌ల పేరుతో మోసం ప్రారంభమవుతుంది. కాల్ సమయంలో అవతలి వైపు అసభ్యకర వీడియోలు ప్లే చేసి, వినియోగదారుడి ముఖాన్ని రికార్డ్ చేస్తారు.

తర్వాత ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి, బాధితుల కాంటాక్ట్‌లకు పంపుతామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ విధానాన్ని “సెక్స్‌టార్షన్”గా పిలుస్తారు. పరువు పోతుందన్న భయంతో పలువురు డబ్బులు చెల్లిస్తూ మోసపోతున్నారు.

సైబర్ నిపుణులు, పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. గుర్తుతెలియని యాప్‌లు, ఫేక్ డేటింగ్ యాప్‌లు, అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయకూడదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో కనిపించే ఇలాంటి ప్రకటనలపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇప్పటికే ఎవరు ఈ వలలో చిక్కుకున్నా భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. ఇందుకోసం 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయవచ్చు లేదా అధికారిక వెబ్‌సైట్ http://cybercrime.gov.in ద్వారా కంప్లైంట్ నమోదు చేయవచ్చు.

ఆన్‌లైన్ ప్రపంచంలో అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తీయటి మాటల వెనుక దాగి ఉన్న మోసాలను గుర్తించి, అప్రమత్తంగా ఉండటం ద్వారా మాత్రమే ఇలాంటి సైబర్ నేరాల నుంచి రక్షించుకోవచ్చు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE