e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో రూ.లక్షల మోసం.. ముఠా గుట్టురట్టు!

చిల్డ్రన్ బ్యాంక్ నోట్లతో రూ.లక్షల మోసం.. ముఠా గుట్టురట్టు!
డబ్బులు రెట్టింపు చేస్తామంటూ ప్రజలకు టోకరా.. నలుగురు నిందితుల అరెస్ట్
99 కట్టల నకిలీ నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం
ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో నిందితులపై పలు కేసులు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24:

పూజలు, మంత్రతంత్రాల పేరుతో డబ్బులను రెట్టింపు చేస్తామని ప్రజలను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేయడంతో పాటు, చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అసలైన కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో నలుగురు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ముఠాలోని మరో ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే వేరే కేసులో అరెస్టయి ఉన్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పోలీస్ సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

రూ.8 లక్షలు వసూలు చేసి మోసం..

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన పత్తి రాములుకు 2023 నవంబర్‌లో అత్రం పరశురామ్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న పరశురామ్ పూజలు, మంత్రతంత్రాల ద్వారా డబ్బులను రెట్టింపు చేయవచ్చని నమ్మించాడు. రూ.6.50 లక్షలు ఇస్తే పూజలు నిర్వహించి రూ.13 లక్షలు తిరిగి ఇస్తానని ఆశ చూపించాడు.

అతని మాటలు నమ్మిన బాధితుడు 10.11.2023న షాంపూర్ గ్రామ శివారులో పరశురామ్‌కు రూ.6.50 లక్షలు అందజేశాడు. అనంతరం అతడిని ఒక పొలం వద్దకు తీసుకెళ్లి సుమారు 15 నిమిషాల పాటు పూజలు నిర్వహించి, డబ్బులు రెట్టింపు అయ్యాయని చెబుతూ ఒక బ్యాగును అందజేశాడు. పది రోజుల తర్వాత బ్యాగు తెరవాలని సూచించాడు.

పది రోజుల అనంతరం బ్యాగును తెరిచి చూడగా అందులో అసలైన కరెన్సీకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లు, తెల్ల కాగితాలు కనిపించాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పరశురామ్‌ను ప్రశ్నించగా, ఇంట్లో దోషం ఉందని, మరోసారి పూజలు చేయాలని నమ్మించాడు. ఇంటి శుద్ధి పూజల పేరుతో రూ.50 వేలు, గతంలో ఇచ్చిన డబ్బులు రెట్టింపు అవుతాయని చెప్పి మరో రూ.లక్ష వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.8 లక్షలు తీసుకుని బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఈ మోసంపై బాధితుడు 22.11.2026న ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు క్రైమ్ నంబర్ 433/2026, సెక్షన్ 420 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ఈ మోసాల వెనుక పెద్ద ముఠా ఉన్నట్లు గుర్తించారు.

అసలైన నోట్ల మధ్య నకిలీ నోట్ల కట్టలు

ముఠా సభ్యులు అనుసరిస్తున్న మోసపూరిత విధానాన్ని పోలీసులు గుర్తించారు. ప్రధాన నిందితులైన అత్రం పరశురామ్, మండలి బక్కన్నలు పూజలు, మంత్రతంత్రాల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా, వారికి సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులు చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇతర పేర్లతో ముద్రించిన నోట్లను కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

అసలైన కరెన్సీ నోట్ల కట్టలుగా కనిపించేలా పైన, కింద అసలైన నోట్లను ఉంచి, మధ్యలో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లను అమర్చి అమాయకులను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అరెస్టయిన నలుగురు నిందితులు వీరే..

1. ఎంబడి మల్లేష్ (36), తండ్రి నర్సయ్య, చెన్నూరు గ్రామం, దస్తూరాబాద్ మండలం, నిర్మల్ జిల్లా.
2. చీటి తరుణ్ (24), తండ్రి లూకయ్య, మదర్ థెరిస్సా కాలనీ, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా.
3. జమల్‌పూర్ సాయి కృష్ణ అలియాస్ సాయి (25), తండ్రి సత్తయ్య, శ్రీలంక కాలనీ, పొన్కల్ గ్రామం, జన్నారం మండలం, మంచిర్యాల జిల్లా.
4. పేంద్రం సురేష్ (39), తండ్రి కిషన్, వరద బాధితుల కాలనీ, జన్నారం గ్రామం, మంచిర్యాల జిల్లా.

ఇప్పటికే అరెస్టయిన ఇద్దరు ప్రధాన నిందితులు

1. అత్రం పరశురామ్ (40), తండ్రి పైకు, గిన్నెర గ్రామం, ఇంద్రవెల్లి మండలం.
2. మండలి బక్కన్న (47), తండ్రి ఇంద్రయ్య, శాంతినగర్ కాలనీ, ఇంద్రవెల్లి గ్రామం, ఇంద్రవెల్లి మండలం.

ఈ ఇద్దరు ప్రధాన నిందితులు ఇప్పటికే ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మరో కేసులో సోమవారం అరెస్టయినట్లు ఎస్పీ వెల్లడించారు.

రూ.40 లక్షలకు పైగా విలువైన నకిలీ నోట్లు స్వాధీనం

పోలీసులు అరెస్టయిన నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు ఇలా ఉన్నాయి.

– రూ.500 ముఖ విలువతో చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్ల 34 కట్టలు.
– రూ.100 ముఖ విలువతో ముద్రించిన నోట్ల 55 కట్టలు.
– రూ.2,000 ముఖ విలువతో ముద్రించిన నోట్ల 10 కట్టలు.
– మొత్తం 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు.
– 100 నకిలీ బంగారు నాణేలు.
– మూడు సెల్‌ఫోన్లు.

స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్ల విలువ రూ.40 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

40 మంది వరకు బాధితులు ఉండే అవకాశం

నిందితులపై ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ జిల్లాల్లో వివిధ రకాల కేసులు నమోదైనట్లు ఎస్పీ తెలిపారు. ఒక్కొక్క నిందితుడిపై మూడు కేసుల వరకు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ముఠా చేతిలో సుమారు 40 మంది వరకు బాధితులు మోసపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఫిర్యాదు చేయని బాధితులు ఎవరైనా ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ

పూజలు, మంత్రతంత్రాల ద్వారా డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. తక్కువ సమయంలో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో ఇలాంటి మోసగాళ్లకు డబ్బులు ఇచ్చి నష్టపోవద్దన్నారు. ముఖ్యంగా కరెన్సీ నోట్ల కట్టలను స్వీకరించే సమయంలో ప్రతి నోటును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.

అసలైన కరెన్సీ నోట్లతో పాటు ఇతర పేర్లతో ముద్రించిన నోట్లను కలిపి కట్టలుగా తయారు చేసి మోసాలకు పాల్పడే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలాంటి మోసాల గురించి సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని జిల్లా ఎస్పీ కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE