e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

నకిలీ షూరిటీ పత్రాలతో కోర్టులను మోసం.. ఒకరి అరెస్ట్

నకిలీ షూరిటీ పత్రాలతో కోర్టులను మోసం.. ఒకరి అరెస్ట్

నకిలీ ఇంటి పన్ను రశీదులు, నివాస ధ్రువీకరణ పత్రాల తయారీ

క్రిమినల్ కేసుల్లో నిందితులకు షూరిటీలు ఇచ్చి అక్రమంగా డబ్బుల వసూలు

ఐదు పత్రాలు, మొబైల్ ఫోన్ స్వాధీనం.. మరో వ్యక్తి పాత్రపై దర్యాప్తు

మన భారత్, బోరజ్, నవంబర్ 20: న్యాయస్థానాలను తప్పుదోవ పట్టిస్తూ క్రిమినల్ కేసుల్లో బెయిల్ పొందేందుకు నిందితులకు నకిలీ షూరిటీ పత్రాలు సమకూరుస్తున్న వ్యక్తిని జైనథ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఇంటి పన్ను రశీదులు, నివాస ధ్రువీకరణ పత్రాలను సృష్టించి, వాటిపై గ్రామపంచాయతీ అధికారిక ముద్రలు, సంతకాలను ఉపయోగిస్తూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఒకరిని అరెస్ట్ చేసి, మరో వ్యక్తి పాత్రపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వివరాలను జైనథ్ సీఐ జి. శ్రవణ్ కుమార్ వెల్లడించారు.

షూరిటీ పత్రాల పేరుతో అక్రమ వసూళ్లు

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బోరజ్ మండలం గిమ్మ గ్రామానికి చెందిన అమ్ముల రమేష్ (43) గతంలో ఆర్మీలో పనిచేసి, ప్రస్తుతం గ్రామంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. తక్కువ శ్రమతో అధిక మొత్తంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో క్రిమినల్ కేసుల్లో జైలుకు వెళ్లిన నిందితులకు బెయిల్ కోసం షూరిటీలు సమకూర్చి డబ్బులు వసూలు చేయాలని పథకం రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో గిమ్మ గ్రామపంచాయతీ కార్యదర్శి కనపర్తి విజయ్ కుమార్‌తో కలిసి తప్పుడు పేర్లతో ఇంటి పన్ను రశీదులు, ఇంటి ధ్రువీకరణ పత్రాలు తయారు చేయించేవాడని పేర్కొన్నారు. వాటిపై గ్రామపంచాయతీ అధికారిక ముద్రలు, కార్యదర్శి సంతకాలు తీసుకొని కోర్టుల్లో షూరిటీ పత్రాలుగా వినియోగించేందుకు నిందితులకు అందజేసేవాడని, ఇందుకు ప్రతిఫలంగా వారి నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవాడని వివరించారు.

కిరాణా దుకాణంలో పోలీసుల తనిఖీలు

ఈ అక్రమ వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందడంతో జైనథ్ పోలీసులు గిమ్మ గ్రామంలోని రమేష్ కిరాణా దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని వద్ద ఐదు ఇంటి పన్ను రశీదులు, ధ్రువీకరణ పత్రాలు గుర్తించారు. వాటిని పరిశీలించగా మూడు అసలైనవి కాగా, మరో రెండు నకిలీవిగా తేలినట్లు పోలీసులు తెలిపారు.

దీంతో నకిలీ పత్రాలతో పాటు మొత్తం ఐదు ఇంటి పన్ను రశీదులు, ధ్రువీకరణ పత్రాలు, ఒక మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన అమ్ముల రమేష్‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.

కేసు నమోదు.. కొనసాగుతున్న దర్యాప్తు

ఈ ఘటనపై జైనథ్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.273/2026, BNS సెక్షన్లు 318(4), 336(3) r/w 3(5) కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో మరికొందరి పాత్ర ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

నిందితుల వివరాలు:

అమ్ముల రమేష్ (43): తండ్రి భూమన్న, వృత్తి కిరాణా దుకాణం, గిమ్మ గ్రామం, బోరజ్ మండలం. (అరెస్ట్)

కనపర్తి విజయ్ కుమార్: గిమ్మ గ్రామపంచాయతీ కార్యదర్శి.

నకిలీ పత్రాల వినియోగంపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా జైనథ్ సీఐ జి. శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. క్రిమినల్ కేసుల్లో బెయిల్ పొందేందుకు నకిలీ షూరిటీ పత్రాలను సమర్పించడం, ప్రభుత్వ అధికారిక ముద్రలు, అధికారుల సంతకాలను దుర్వినియోగం చేయడం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పత్రాలను తప్పుడు అవసరాలకు వినియోగించే ప్రయత్నం చేసినా ఉపేక్షించేది లేదని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE