e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి క్షణం విలువైనదే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

ఆదిలాబాద్‌లో 60 రోజుల ఉచిత ఎస్ఐ, కానిస్టేబుల్ శిక్షణ శిబిరం ముగింపు
300 మందికి పైగా అభ్యర్థులకు నిపుణులచే శిక్షణ.. అర్హత సాధించిన వారికి తదుపరి దశలోనూ ఉచిత శిక్షణ, భోజనం, వసతి

పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి క్షణం విలువైనదే.. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 14,

ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీపడుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 60 రోజుల ఉచిత ప్రిలిమినరీ పరీక్ష శిక్షణ శిబిరం శనివారం ముగిసింది. స్థానిక జిల్లా శిక్షణ కేంద్రం (డీటీసీ) ప్రాంగణంలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాలకు చెందిన 300 మందికి పైగా అభ్యర్థులు పాల్గొన్నారు. నిష్ణాతులైన అధ్యాపకులచే వారికి వివిధ పోటీ పరీక్షల అంశాల్లో శిక్షణ అందించారు.

శిక్షణ ముగింపు కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులకు పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష, డిసెంబర్ 20న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష పూర్తయ్యే వరకు ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలని సూచించారు. సమయాన్ని వృథా చేయకుండా ప్రణాళికాబద్ధంగా చదువుతూ పరీక్షలకు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని తెలిపారు.

తల్లిదండ్రులు, అధ్యాపకులు ఇచ్చే సూచనలను పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, నిరంతర శ్రమతో చదివిన వారికి విజయం సాధించే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న అంశాలను మరోసారి పునశ్చరణ చేసుకోవాలని, గతంలో నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నలను రెండు మూడు సార్లు సాధన చేయాలని సూచించారు. ప్రతి సబ్జెక్టుకు తగిన ప్రాధాన్యత కేటాయించుకుని చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని అభ్యర్థులకు వివరించారు.

ఈ 60 రోజుల శిక్షణలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్, ఇంగ్లీష్, భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం, భారత రాజ్యాంగం, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర అంశాలను బోధించారు. ఆదిలాబాద్‌తో పాటు వరంగల్, హైదరాబాద్, నల్గొండ ప్రాంతాలకు చెందిన నిపుణులైన అధ్యాపకులు అభ్యర్థులకు పాఠాలు బోధించారు. శిక్షణలో భాగంగా ఉచిత పాఠ్యపుస్తకాలను కూడా పంపిణీ చేశారు.

అభ్యర్థులకు మరింత ప్రోత్సాహం అందించే ఉద్దేశంతో ప్రిలిమినరీ పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి తదుపరి దశ పరీక్షల కోసం కూడా ఉచిత శిక్షణ అందిస్తామని ఎస్పీ వెల్లడించారు. వారికి ఉచిత భోజనం, వసతి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందిన అభ్యర్థులు మాట్లాడుతూ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలకు చెందిన తమలాంటి వారికి జిల్లా పోలీస్ శాఖ అందించిన ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో ఖర్చు భరించలేని పరిస్థితుల్లో పోలీస్ శాఖ కల్పించిన ఈ అవకాశం తమకు ఎంతో తోడ్పడిందని పేర్కొంటూ జిల్లా ఎస్పీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో శిక్షణ అందించిన అధ్యాపకులను జిల్లా ఎస్పీ శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ డి. వెంకటి, శిక్షణ కేంద్రం సిబ్బంది, అధ్యాపకులు ప్రసాద్, వివేక్, ఫణీంద్ర, రమణ గౌడ్, అల్లం సాయికృష్ణ, శంకర్, రమేష్, సమీర్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE