e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 22, 2026

కరువు మండలంగా ప్రకటించేందుకు కృషి చేస్తాం

తలమడుగును కరువు మండలంగా ప్రకటించేందుకు కృషి చేస్తాం

గోదాం వరకు రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.. సర్పంచులకు ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హామీ

మన భారత్, తలమడుగు:నవంబర్ 12, తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, మండల కేంద్రంలోని గోదాం వరకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మండల సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించిన నేపథ్యంలో ఆయన సర్పంచుల వద్దకు చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఏసీఎస్ చైర్మన్ దామోదర్ రెడ్డితో కలిసి సర్పంచులు, రైతులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.

ఈ సందర్భంగా బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలోని ఇతర మండలాలతో పాటు తలమడుగు మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ తరఫున, డీసీసీ ఆధ్వర్యంలో, మార్కెట్ కమిటీ చైర్మన్ హోదాలో ఇప్పటికే జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించినట్లు వెల్లడించారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అవసరమైతే మండల సర్పంచులు, రైతులతో కలిసి సంబంధిత మంత్రులను, ముఖ్యమంత్రిని నేరుగా కలిసి తలమడుగును కరువు మండలంగా ప్రకటించేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులందరూ సమన్వయంతో ముందుకు రావాలని సూచించారు.

గోదాం రోడ్డు నిర్మాణానికి హామీ

తలమడుగు మండలంలోని గోదాం వరకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను సర్పంచులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన శ్రీకాంత్ రెడ్డి గోదాం వరకు రోడ్డు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకువచ్చి, త్వరలోనే రహదారి సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే రైతులకు పంట ఉత్పత్తుల రవాణాతో పాటు గోదాం వినియోగం కూడా సులభతరం కానుంది.

భూసార పరిరక్షణపై రైతులకు సూచనలు

రైతులు పంటల సాగులో సూక్ష్మ పోషకాలు (మైక్రో న్యూట్రియంట్స్) ప్రాధాన్యతను గుర్తించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు. రసాయన ఎరువులను విచక్షణారహితంగా వినియోగించడం వల్ల భూమి స్వభావం దెబ్బతిని, భూసారం తగ్గే ప్రమాదం ఉందన్నారు. పంటల అవసరాలకు అనుగుణంగా పోషకాలను అందిస్తూ భూమి సారాన్ని కాపాడుకునే విధంగా వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని కోరారు.

సర్పంచులు, అనుభవజ్ఞులైన రైతులు గ్రామాల్లోని ఇతర రైతులకు భూసార పరిరక్షణ, సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు సైతం ప్రతి గ్రామంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రైతులకు అవసరమైన సాంకేతిక సూచనలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, వ్యవసాయ అధికారులు ఏఓ శ్రీనివాస్ రావు, ప్రమోద్ రెడ్డి, స్థానిక సర్పంచులు మగ్గిడి నర్సమ్మ ప్రకాష్, ఎలుగు రాజన్న, రైతు జేఏసీ అధ్యక్షుడు నల్ల పద్మాకర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE