e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం..

ప్లాట్ పేరుతో రూ.67.20 లక్షల మోసం.. నకిలీ పత్రాలతో బ్యాంకు రుణం

ఆదివాసీ బాధితుడిని కులం పేరుతో దూషించి, హత్య చేస్తామని బెదిరింపులు.. ముగ్గురిపై అట్రాసిటీ కేసు

ప్రధాన నిందితుడి అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు: డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 2: ప్లాట్ కొనుగోలు పేరుతో ఆదివాసీ వ్యక్తిని మోసం చేసి, నకిలీ పత్రాలతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు బ్యాంకు రుణం ఇప్పించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు వ్యక్తులపై ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని ఎల్‌బీఎస్ నగర్‌లో ప్లాట్ ఉందని నమ్మించి, ప్లాట్ కొనుగోలుతో పాటు ఇంటి నిర్మాణానికి బ్యాంకు రుణం ఇప్పిస్తామని నిందితులు ఫిర్యాదుదారుడు మడావి గోపాల్ ను నమ్మించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్లాట్ నంబర్ 37, సర్వే నంబర్ 45కు సంబంధించిన స్థలాన్ని నకిలీ పత్రాల ఆధారంగా ఫిర్యాదుదారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బ్యాంకు రుణం పేరుతో మరో రూ.13.70 లక్షలు

ప్లాట్ కొనుగోలు అనంతరం ఇంటి నిర్మాణం కోసం ఎస్‌బీఐ నుంచి రూ.53.50 లక్షల రుణం పొందేలా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మొత్తంతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు. నిర్మాణం పూర్తిచేసేందుకు బ్యాంకు రుణం సరిపోదని చెప్పి అదనంగా రూ.13.70 లక్షలు తీసుకున్నట్లు బాధితుడు ఆరోపించారు. దీంతో మొత్తం రూ.67.20 లక్షల మేర మోసం జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

అసలు యజమాని వేరే వ్యక్తి.. ఇంటి స్వాధీనం

1987లో రామేశ్వర్ అనే వ్యక్తి సంబంధిత స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదే ప్లాట్‌ను బాధితుడికి విక్రయించినట్లు ఫిర్యాదులో ఆరోపించారు. ఇంటి నిర్మాణం పూర్తయి గృహప్రవేశానికి సిద్ధమవుతున్న సమయంలో అసలు యజమాని అధికారుల సమక్షంలో ఇంటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

2026 ఆగస్టులో హైకోర్టు ఉత్తర్వుల మేరకు మున్సిపల్ అధికారులు ఇంటిని స్వాధీనం చేసుకోవడంతో అసలు విషయం తనకు తెలిసిందని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కులం పేరుతో దూషించి.. హత్య చేస్తామని బెదిరింపులు

మోసం జరిగిన విషయం తెలుసుకున్న అనంతరం నిందితులను ప్రశ్నించేందుకు ఫిర్యాదుదారుడి కుమారుడు, సోదరుడు తదితరులు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమయంలో వారిని కులం పేరుతో దూషించడంతో పాటు చంపుతామని బెదిరించినట్లు ఫిర్యాదులో ఆరోపణలు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ముగ్గురు నిందితులపై అట్రాసిటీ చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ముగ్గురిపై కేసు.. ఒకరి అరెస్టు

ఈ కేసులో నిందితులుగా గటిక లక్ష్మణ్ స్వామి (సంజయ్‌నగర్), గటిక క్రాంతి కుమార్, క్రాంతి నగర్ కౌన్సిలర్ తోకల నరేష్ ను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరిలో గటిక క్రాంతి కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. మరో ఇద్దరిలో తోకల నరేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

రిజిస్ట్రేషన్ పత్రాలు, బ్యాంకు రుణానికి సంబంధించిన రికార్డులు, ఇంటి నిర్మాణ అనుమతులు, స్థల యాజమాన్య హక్కులు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను దర్యాప్తులో నిర్ధారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి మీ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE