రిమ్స్ ఘటనపై జనసేన ఆందోళన.. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి
మృత శిశువుల కుటుంబాలకు కోటి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్
మన భారత్, సెప్టెంబర్ 23, ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని స్పెషల్ న్యూబోర్న్ కేర్ యూనిట్ (SNCU)లో జరిగిన అగ్ని ప్రమాదంపై జనసేన పార్టీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పార్లమెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్, ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకుడు పడాల రవీందర్ పటేల్ డిమాండ్ చేశారు. రిమ్స్‌లో మంగళవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు నవజాత శిశువులు మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఈ డిమాండ్లు చేశారు. తాజా నివేదికల ప్రకారం మృతుల సంఖ్య ఐదుకు చేరింది.
జనసేన నాయకులు రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్‌తో కలిసి చిల్డ్రన్స్ వార్డును సందర్శించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలు, ప్రస్తుతం శిశువులకు అందుతున్న వైద్యం, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధిత చిన్నారుల పరిస్థితి, వారి తల్లిదండ్రులకు అందుతున్న వైద్య సహాయం తదితర అంశాలపై రిమ్స్ డైరెక్టర్‌తో చర్చించారు.
పేద కుటుంబాలకు చెందిన బాధిత శిశువులకు పూర్తి స్థాయిలో ఉచితంగా, నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు కోరారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల వైద్య ఖర్చుల విషయంలో కూడా ప్రభుత్వం తగిన భరోసా కల్పించాలని కోరారు.
జనసేన ప్రధాన డిమాండ్లు
* రిమ్స్ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
* మృతిచెందిన శిశువుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలి.
* ప్రమాదంలో గాయపడిన ప్రతి చిన్నారికి పూర్తిగా ఉచిత వైద్యం అందించాలి.
* మృత శిశువుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా అందించాలి.
* ప్రతి బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
* సమగ్ర విచారణ నిర్వహించి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి.
రిమ్స్ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించగా, అగ్ని ప్రమాదానికి కారణాలు, ఆసుపత్రిలో భద్రతా లోపాలు, నిర్వహణ అంశాలను పరిశీలించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి.
“ప్రతి తల్లి కడుపుకోతకు న్యాయం జరగాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం కొనసాగిస్తుంది. ప్రతి బిడ్డకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి” అని జనసేన నాయకులు పేర్కొన్నారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
