నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్న డీఎస్పీ జీవన్ రెడ్డి
ఆదిలాబాద్, సెప్టెంబర్ 17 (మన భారత్): గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజేలకు ఎలాంటి అనుమతి లేదని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. డీజేలకు అనుమతి మంజూరైందంటూ సామాజిక మాధ్యమాలు, వాట్సప్ గ్రూపుల్లో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు.
ఆదిలాబాద్ సబ్‌డివిజన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా డీజేలను వినియోగించిన డీజే, వాహన యజమానులపై ఇప్పటివరకు 10 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆయా కేసుల్లో డీజే సౌండ్ సిస్టమ్స్‌తో పాటు సంబంధిత వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
డీజేలకు అనుమతి ఉందంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కూడా పోలీసులు నిఘా ఉంచినట్లు డీఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నిర్ధారించుకోకుండా నమ్మి నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగిస్తే నిర్వాహకులతో పాటు డీజే, వాహన యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
గణపతి మండపాల నిర్వాహకులు పోలీసుల సూచనలు, ఉత్సవాలకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భక్తులు, యువత, నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
నిమజ్జన కార్యక్రమాలను నిర్ణీత సమయంలో ప్రారంభించి, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. నిమజ్జన సమయంలో పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.
జిల్లాలో గణపతి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ శాఖ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోందని డీఎస్పీ తెలిపారు. అధికారికంగా వెల్లడించే సమాచారాన్నే ప్రజలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
