బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ట్రాన్స్‌జెండర్ అరెస్ట్
మావల బైపాస్ వద్ద వాహనదారులను అడ్డుకుని డబ్బులు వసూలు చేశారన్న ఫిర్యాదు
శుభకార్యాల్లో బలవంతపు వసూళ్లకు పాల్పడితే చర్యలు తప్పవు: సీఐ బీడీ ప్రేమ్ కుమార్
మన భారత్, సెప్టెంబర్ 10,ఆదిలాబాద్:
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఓ ట్రాన్స్‌జెండర్ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మావల బైపాస్ వద్ద వాహనదారులు, ప్రయాణికులను అడ్డుకుని డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ చర్యలు తీసుకున్నట్లు మావల సీఐ బీడీ ప్రేమ్ కుమార్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మావల బైపాస్ వద్ద వాహనదారులను, ప్రయాణికులను ఆపుతూ బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ డయల్ 100 కు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుడిగా మహారాష్ట్రలోని యావత్మాల్‌కు చెందిన నీలేష్ గజానన్ గడాగే @ రియా (23) ను పోలీసులు గుర్తించారు. ఘటనపై మావల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ.. రోడ్లపై ప్రయాణికులను, వాహనదారులను బలవంతంగా అడ్డుకుని వసూళ్లకు పాల్పడటం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫిర్యాదు ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాల సమయంలో కూడా బలవంతంగా డబ్బులు వసూలు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదని, రోడ్లపై బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112 కు సమాచారం అందించాలని సీఐ కోరారు. ఫిర్యాదులపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని తెలిపారు.
బలవంతపు వసూళ్లకు పాల్పడే వ్యక్తులపై వారి లింగ గుర్తింపుతో సంబంధం లేకుండా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతలను పరిరక్షించడమే పోలీసుల లక్ష్యమని తెలిపారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
