మన భారత్ | ఇచ్చోడ
గంజాయి రహిత ఆదిలాబాద్ కోసం ప్రతి పోలీసు బాధ్యతగా పనిచేయాలి..
ఇచ్చోడలో నూతన ఎస్‌హెచ్‌ఓ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఇచ్చోడ, జూలై 7 (మన భారత్): ఆదిలాబాద్ జిల్లాను పూర్తిస్థాయిలో గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై రాజీపడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ దిశగా ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని నగదు రివార్డులతో ప్రోత్సహిస్తామని తెలిపారు.
మంగళవారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) కార్యాలయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ శాస్త్రోక్తంగా, వేదమంత్రాల నడుమ ప్రారంభించారు. అనంతరం ఎస్‌హెచ్‌ఓ కె. నరేష్ కుమార్‌తో ప్రత్యేక పూజలు నిర్వహించి, విధుల కుర్చీలో కూర్చోబెట్టి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత అని గుర్తుచేశారు. పోలీస్ స్టేషన్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేలా పారదర్శకంగా, సేవా దృక్పథంతో పనిచేయాలని సూచించారు.
అనంతరం పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, పరిపాలనా వ్యవస్థ, ఇతర విభాగాలను పరిశీలించిన ఎస్పీ అధికారులకు పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసుల విచారణను వేగవంతం చేయడంతో పాటు వర్టికల్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ అన్ని రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. ప్రతి పోలీసు సిబ్బంది సమయపాలన, క్రమశిక్షణ, నిజాయితీ, జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.
మండల పరిధిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిరంతర నిఘా కొనసాగించాలని, ముఖ్యంగా గంజాయి సాగు, రవాణా, విక్రయాలు, వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు. ప్రజల సహకారంతో సమాచారం సేకరించి మాదకద్రవ్యాల నిర్మూలనకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నియంత్రణపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించిన ఎస్పీ, ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీస్ శాఖ చేపడుతున్న “అరైవ్ అలైవ్” కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని, “కాకి కిడ్స్” కార్యక్రమం ద్వారా విద్యార్థులు, యువత, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచాలని ఎస్పీ పేర్కొన్నారు.
గంజాయి నిర్మూలనలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని నగదు రివార్డులతో సత్కరిస్తామని ప్రకటించిన ఎస్పీ, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని పునరుద్ఘాటించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే ఐపీఎస్, ఇచ్చోడ రూరల్ సీఐ సి.హెచ్. రమేష్, ఇచ్చోడ ఇన్‌స్పెక్టర్ కె. నరేష్ కుమార్, ఎస్సైలు ఈశ్వర్, రామకృష్ణతో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారూ.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
