e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, November 28, 2026

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు.. 28 కేంద్రాల్లో 10,104 మంది అభ్యర్థులు

ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు.. 28 కేంద్రాల్లో 10,104 మంది అభ్యర్థులు

ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదు – ఎస్పీ అఖిల్ మహాజన్

పరీక్ష కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ అమలు.. ట్రాఫిక్ హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు

దూర ప్రాంతాల్లోని 9 పరీక్ష కేంద్రాల అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలి

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 27:

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నవంబర్ 29న ఆదివారం నిర్వహించనున్న ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్షకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని 28 పరీక్షా కేంద్రాల్లో మొత్తం 10,104 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. పరీక్షకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (TSLPRB) ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన పరీక్షా నిర్వహణ బాధ్యతలను జేఎన్టీయూ పర్యవేక్షిస్తుందని, పరీక్షా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ చేపడుతుందని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సీఐ స్థాయి అధికారిని ఇన్‌చార్జిగా నియమించామని, రూట్, సెక్టార్ స్థాయిల్లో డీఎస్పీ అధికారులు పర్యవేక్షణ చేస్తారని వివరించారు. అదనపు ఎస్పీ పి. మౌనిక ఐపీఎస్ పోలీస్ నోడల్ అధికారిగా బందోబస్తు ఏర్పాట్లను సమన్వయం చేస్తారని తెలిపారు.

200 మీటర్ల పరిధిలో ఆంక్షలు

పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ (గతంలో 144 సెక్షన్) అమలు చేయనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ పరిధిలో జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అనధికార వ్యక్తుల సంచారాన్ని నియంత్రించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హెల్ప్ డెస్క్‌లు

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణా, ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు కలగకుండా ఆదిలాబాద్ బస్టాండ్, కలెక్టర్ చౌరస్తా వద్ద రెండు ట్రాఫిక్ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణానికి దూరంగా ఉన్న తొమ్మిది పరీక్షా కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులు ప్రయాణ సమయాన్ని ముందుగానే అంచనా వేసుకుని త్వరగా బయలుదేరాలని సూచించారు.

బస్టాండ్ నుంచి ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్, ఆర్యభట్ట హైస్కూల్, ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ స్కూల్ కేంద్రాలకు ఉదయం 8:30 గంటలకు, 9 గంటలకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు వివరించారు.

దూర ప్రాంతాల్లోని తొమ్మిది పరీక్షా కేంద్రాలు ఇవే..

ఓక్లే ఇంటర్నేషనల్ స్కూల్, చందా.

ఆర్యభట్ట హైస్కూల్, భీంసరి గ్రామం.

అభ్యుదయ హైస్కూల్, పిప్పర్వాడ టోల్ ప్లాజా.

ఎస్ఆర్ ప్రైమ్ స్కూల్, మావల.

ఎస్ఆర్ జూనియర్ కాలేజ్, మావల.

వివేకానంద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దుర్గానగర్.

రెసొనెన్స్ వరల్డ్ స్కూల్, దుర్గానగర్.

సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ హైస్కూల్, రాంపూర్ గ్రామం.

ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మహాలక్ష్మివాడ.

ఈ కేంద్రాల్లో పరీక్ష రాసే అభ్యర్థులు ప్రయాణంలో ఆలస్యం కాకుండా ముందుగానే బయలుదేరి నిర్ణీత సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచించారు.

ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష

ఎస్ఐ ప్రిలిమినరీ రాత పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకల్లా తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా పరీక్షా హాలులోకి అనుమతిస్తారని, నిర్ణీత సమయం దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులు బయటకు వెళ్లేందుకు అనుమతి ఉండదని తెలిపారు.

అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు

హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉండాలి. ఏ4 పేపర్‌పై రెండు వైపులా ప్రింట్ తీసుకుని, నిర్దేశించిన చోట పాస్‌పోర్ట్ సైజు ఫొటో అతికించాలి.

పరీక్షా కేంద్రంలోకి హాల్‌టికెట్, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్నులు మాత్రమే తీసుకెళ్లాలి.

మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, బ్లూటూత్ పరికరాలు, ట్యాబ్లెట్లు, కాలిక్యులేటర్లు, ఇయర్ పరికరాలు, నోట్స్ తదితర ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.

పెన్సిళ్లు, జెల్ పెన్నులు, ఇతర రంగుల పెన్నులు తీసుకురాకూడదు.

మహిళా అభ్యర్థులు భారీ బంగారు ఆభరణాలు, హ్యాండ్‌బ్యాగులు, పర్సులు తీసుకురావద్దు. పరీక్షా కేంద్రాల్లో వస్తువులను భద్రపరిచే సదుపాయం ఉండదని గుర్తించాలి.

అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు, బయోమెట్రిక్ వివరాలు, సంతకాలు సేకరించడంతో పాటు ఆధార్ ఫేషియల్ అథెంటికేషన్ నిర్వహిస్తారు. బయోమెట్రిక్ నమోదుకు ఆటంకం కలిగించే విధంగా వేళ్లపై మెహందీ, ఇతర పదార్థాలు ఉండకూడదు.

ప్రశ్నపత్రంలో మొత్తం 200 ప్రశ్నలు, 200 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలోని పేజీలన్నీ సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి.

తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. కాబట్టి సమాధానాలను గుర్తించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ఓఎంఆర్ షీట్‌పై వైట్ ఫ్లూయిడ్ లేదా ఎరేజర్ ఉపయోగించకూడదు. సమాధానాలను మార్చే ప్రయత్నం చేయరాదు.

పరీక్ష ముగిసిన అనంతరం ఓఎంఆర్ ఆన్సర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు తప్పనిసరిగా అందజేయాలి.

పరీక్ష సమయంలో ఇతర అభ్యర్థులతో మాట్లాడటం, సమాధానాలు తెలుసుకోవడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం నిషేధం.

ప్రశ్నపత్రం ఇంగ్లీష్-తెలుగు, ఇంగ్లీష్-ఉర్దూ భాషల్లో ఉంటుంది. అనువాదంలో సందిగ్ధత ఏర్పడితే ఇంగ్లీష్ ప్రశ్ననే ప్రామాణికంగా పరిగణిస్తారు.

పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ ఓఎంఆర్ షీట్లను సేకరించి భద్రపరిచే వరకు అభ్యర్థులు హాల్ నుంచి బయటకు వెళ్లకూడదు. పరీక్షా సిబ్బంది సూచనలను పాటించాలి.

అభ్యర్థులు సమయపాలన పాటించాలి

అభ్యర్థులు హాల్‌టికెట్ వెనుక ముద్రించిన నిబంధనలను పూర్తిగా చదివి వాటిని తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. పరీక్షకు అవసరమైన హాల్‌టికెట్, ఫొటో, పెన్నులు మినహా ఇతర వస్తువులను వెంట తీసుకురావద్దని తెలిపారు. ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి విజయవంతం కావాలని అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE