e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

పోలీస్ మీకోసం కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువగా పోలీస్ శాఖ

పోలీస్ మీకోసం కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువగా పోలీస్ శాఖ

మహాలక్ష్మివాడలో రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన

17 సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్.. పదిమందికి హెల్మెట్ల పంపిణీ

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 17: ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడంతో పాటు శాంతిభద్రతలు, సామాజిక సమస్యలు, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్ మీకోసం కార్యక్రమం పట్టణంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

పాఠశాలకు చేరుకున్న ఎస్పీకి ఎన్‌సీసీ విద్యార్థులు పరేడ్ ద్వారా గౌరవ వందనం సమర్పించి స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం క్రమశిక్షణతో కష్టపడి చదవాలని సూచించారు. చదువుతోపాటు శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ప్రతి విద్యార్థి ఒక మంచి అలవాటు లేదా అభిరుచిని పెంపొందించుకోవడం ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ మెరుగుపడతాయని తెలిపారు.

ఆధునిక సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి అంశాన్ని అర్థం చేసుకొని చదవాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవిస్తూ పట్టుదలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ ఆదర్శంగా నిలిచిన పది మందికి ఎస్పీ చేతుల మీదుగా హెల్మెట్లను అందజేశారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి

గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని ఎస్పీ హెచ్చరించారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు ఎవరూ పాల్పడకూడదని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, అలాంటి ఘటనలు తెలిసినా పోలీసుల దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

మహిళల భద్రతకు షీ టీమ్స్ భరోసా

మహిళలు, బాలికల భద్రతకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ సందర్భంగా షీ టీమ్స్ సభ్యులు మహిళల భద్రత, వేధింపుల నివారణపై ప్రత్యేక అవగాహన కల్పించారు. ఎవరైనా మహిళలు, బాలికలు వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులను సంప్రదించాలని, షీ టీమ్స్ ద్వారా అవసరమైన సహాయం, రక్షణ కల్పిస్తామని వివరించారు.

విద్యార్థులకు క్రీడా పోటీలు

పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా విద్యార్థినులు, విద్యార్థులకు వేర్వేరుగా వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీలు నిర్వహించారు. పట్టణంలోని ఆరు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు అందజేసి అభినందించారు. చదువుతోపాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు జట్టుగా పనిచేసే స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

మహాలక్ష్మివాడలో 17 సీసీటీవీ కెమెరాలు ప్రారంభం

మహాలక్ష్మివాడ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన 17 సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు నేరాల నియంత్రణకు, అసాంఘిక కార్యకలాపాల గుర్తింపునకు దోహదపడుతుందని తెలిపారు. ప్రజలు కూడా పోలీస్ శాఖకు సహకరిస్తూ తమ పరిసరాల్లో భద్రతా చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ మాధవి, టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు, ఎస్‌ఐలు ఎస్. జీవన్ రెడ్డి, లీలాకృష్ణ, జిల్లా ట్రైబల్ స్పోర్ట్స్ అధికారి పార్థసారథి, ఒకటో వార్డు కౌన్సిలర్ మీరాబాయి, టీఏటీఎఫ్ అధ్యక్షుడు లచ్చిరాం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పిల్లి కిషన్, ఎన్‌సీసీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE