e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

జైనథ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

జైనథ్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఇద్దరు నిందితుల అరెస్ట్

మద్యం మత్తులో జరిగిన గొడవే హత్యకు కారణం.. బైక్ బ్రేక్ కేబుల్ వైర్‌తో గొంతు బిగించి హత్య

సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు – హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్, కాల్చివేసిన దోతి స్వాధీనం

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 15: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలో సంచలనం సృష్టించిన గట్టు నారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో జరిగిన చిన్నపాటి గొడవ కక్షగా మారడంతో ఇద్దరు వ్యక్తులు కలిసి నారాయణను దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు జైనథ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రావణ్ కుమార్ వెల్లడించారు.

ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యుడు గట్టు రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైనథ్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 2026 నవంబర్ 6, 7 తేదీల మధ్య రాత్రి గట్టు నారాయణ హత్యకు గురయ్యాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు గ్రామంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించారు. వాటి ఆధారంగా హత్యకు పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

చిన్నపాటి గొడవ.. హత్యకు దారితీసిన కక్ష

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జైనథ్ గ్రామానికి చెందిన ఇప్ప ఈశ్వర్ (38), సత్నాల మండలం తోయగూడ గ్రామానికి చెందిన పెరిక తిరుపతి (39) చిన్ననాటి స్నేహితులు. తిరుపతి జైనథ్ గ్రామానికి చెందిన యువతిని వివాహం చేసుకోవడంతో తరచూ తన అత్తగారింటికి వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి మద్యం సేవించేవారు.

నవంబర్ 6వ తేదీ సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో జైనథ్ బస్టాండ్ వద్ద ఈశ్వర్‌కు తిరుపతి ఎదురయ్యాడు. ఇద్దరూ కలిసి వైన్స్ వద్ద మద్యం సేవించారు. అనంతరం తిరుపతి తన భార్య వద్ద నుంచి రూ.500 తీసుకొచ్చి మరోసారి మద్యం కొనుగోలు చేశారు. గ్రామ సమీపంలోని పత్తి చేనుకు దగ్గరలో ఉన్న రాళ్ల కట్టపై కూర్చొని మద్యం సేవిస్తుండగా గట్టు నారాయణ అటువైపు వచ్చాడు.

ఆ సమయంలో నారాయణ భుజం తిరుపతికి తగలడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. తిరుపతి అసభ్య పదజాలంతో దూషించగా, ఆగ్రహించిన నారాయణ తిరుపతి చెంపపై కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనను అవమానంగా భావించిన తిరుపతి నారాయణపై కక్ష పెంచుకున్నాడు. అతడిని హత్య చేయాలని ఈశ్వర్‌తో చెప్పగా, ఈశ్వర్ కూడా అందుకు అంగీకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ముందస్తు ప్రణాళికతో కేబుల్ వైర్ తీసుకెళ్లి హత్య

నారాయణపై కక్షతో ఉన్న ఇద్దరూ వైన్స్ వద్ద మద్యం కొనుగోలు చేసి, బైక్ బ్రేక్ కేబుల్ వైర్‌ను తీసుకొని అతడి కోసం వేచి చూశారు. రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో నారాయణ జైనథ్ ప్రధాన రహదారి వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరూ అతడిని వెంబడించారు.

రహదారి పక్కన ఉన్న డ్రైనేజీ సమీపంలో అదును చూసి నారాయణను పత్తి చేనులోకి లాక్కెళ్లి, ముఖం, పొట్టపై పిడిగుద్దులు గుద్దినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ముందుగా తెచ్చుకున్న బైక్ బ్రేక్ కేబుల్ వైర్‌ను నారాయణ మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది.

నారాయణ మృతి చెందినట్లు నిర్ధారించుకున్న అనంతరం అతడి జేబులో ఉన్న నగదు, దోతి, హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్‌ను తీసుకొని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఆధారాలు దొరకకుండా దోతి, కేబుల్ వైర్ దహనం

హత్య అనంతరం తమపై అనుమానం రాకుండా ఉండేందుకు నిందితులు మరుసటి రోజు ఉదయం వరకు పత్తి చేనులోనే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నీరాల గ్రామానికి వెళ్లి మద్యం సేవించి బస్సులో తిరిగి జైనథ్‌కు చేరుకున్నారు. హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్‌తో పాటు నారాయణ దోతిని పందుల కోసం ఏర్పాటు చేసిన కూటురులో కాల్చివేసినట్లు విచారణలో వెల్లడించారు.

నిందితుల వివరాలు

ఇప్ప ఈశ్వర్ (38) – తండ్రి కిషన్, జైనథ్ గ్రామం, జైనథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా.

పెరిక తిరుపతి (39) – తండ్రి ఉషన్న, తోయగూడ గ్రామం, సత్నాల మండలం, ఆదిలాబాద్ జిల్లా.

నిందితుల వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు ఉపయోగించిన కేబుల్ వైర్, కాల్చివేసిన దోతి అవశేషాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సాంకేతిక ఆధారాలతో కేసు ఛేదింపు

సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించడం ద్వారా జైనథ్ పోలీసులు ఈ హత్య కేసును ఛేదించారు. హత్య వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జైనథ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. శ్రావణ్ కుమార్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE