e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, November 25, 2026

అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలి

గంజాయి నిర్మూలనకు ప్రాధాన్యత ఇవ్వాలి.. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 30: పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అఖిల్ మహాజన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ పూల మొక్క అందజేసి ఎస్పీకి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ సిబ్బంది నిర్వహించిన గౌరవ వందనాన్ని ఎస్పీ స్వీకరించారు.

స్టేషన్‌లోని రికార్డులు, వివిధ కేసుల ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలు, పోలీస్ వాహనాల స్థితిగతులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ అధికారులతో సమావేశమై విధుల నిర్వహణపై పలు సూచనలు చేశారు.

పట్టణంలో డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, మట్కా వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. నేరాల నియంత్రణకు పటిష్టమైన పెట్రోలింగ్ నిర్వహించాలని, ఆర్థిక నేరాలను అరికట్టేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు.

గంజాయి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు

జిల్లాలో గంజాయి నిర్మూలన పోలీసుల ప్రధాన ప్రాధాన్యతల్లో ఒకటిగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగంపై నిరంతరం నిఘా కొనసాగించాలని, ఈ కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి వినియోగానికి అలవాటు పడిన యువతను గుర్తించి డీ-అడిక్షన్ కేంద్రాల ద్వారా చికిత్స అందించి, వారిని తిరిగి సాధారణ జీవనంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. గంజాయి నిర్మూలనలో విశేషంగా పనిచేసే పోలీస్ సిబ్బందికి నగదు రివార్డులు అందజేస్తామని ప్రకటించారు.

*బాధితుల ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను ఓపికగా విని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా విధులు నిర్వహించాలన్నారు.

సిబ్బందికి సమానంగా విధులు కేటాయించాలని, ప్రతి వారం పరేడ్ నిర్వహిస్తూ శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. విధుల నిర్వహణలో క్రమశిక్షణ, నిజాయితీ, అంకితభావం తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.

*పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి

పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నేరస్తులను గుర్తించి అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశించారు. దర్యాప్తును నిర్ణీత సమయంలో పూర్తి చేసి చార్జిషీట్లు దాఖలు చేయాలని, కోర్టుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని సూచించారు.

కోర్టు డ్యూటీ అధికారులు నిందితులు విచారణకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా పర్యవేక్షించాలని, కోర్టుకు హాజరుకాని వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సీసీటీఎన్ఎస్ రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని, పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసు ఫైళ్లను క్రమపద్ధతిలో నిర్వహించాలని తెలిపారు.

రాష్ట్రస్థాయిలో ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖకు ఉన్న గుర్తింపు, కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు.

ఈ తనిఖీల్లో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్, ఎస్సైలు నాగనాథ్, అశోక్, సంజయ్, హారూన్ అలీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE