e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

రిమ్స్‌లో ఎమ్మెల్యే శంకర్ ఆకస్మిక తనిఖీ..

రిమ్స్‌లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆకస్మిక తనిఖీ

వైద్యులు సమయపాలన పాటించాలి.. నిర్లక్ష్యంపై చర్యలకు సిఫార్సు: పాయల్ శంకర్

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 28, ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో వైద్యుల హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. కొంతమంది వైద్యులు నిర్ణీత సమయానికి విధులకు హాజరు కావడం లేదని, విధులకు వచ్చినా కొద్దిసేపటికే వెళ్లిపోతున్నారనే ఫిర్యాదులు తన దృష్టికి రావడంతో తనిఖీ చేపట్టినట్లు తెలిపారు.

తొలుత రిమ్స్‌ డైరెక్టర్‌ చాంబర్‌లో వైద్యుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి, విధులకు హాజరయ్యే సమయం, సంతకాల నమోదు విధానంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బయోమెట్రిక్‌ హాజరు వ్యవస్థ ద్వారా వైద్యుల రాకపోకలకు సంబంధించిన వివరాలను పరిశీలించారు.

ఆ తర్వాత గైనకాలజీ వార్డుతో పాటు ఓపీ విభాగాలను సందర్శించిన ఎమ్మెల్యే అక్కడి వైద్యులు, సిబ్బందితో మాట్లాడారు. రోజువారీగా వస్తున్న రోగుల సంఖ్య, వారికి అందిస్తున్న వైద్య సేవలు, చికిత్స విధానం తదితర అంశాలపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పలువురు రోగులతో నేరుగా మాట్లాడి వైద్య సేవలపై వారి అభిప్రాయాలను, ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు.

వైద్యుల సమయపాలన తప్పనిసరి

ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో ప్రభుత్వ వైద్యులు ప్రజల పట్ల మానవతా దృక్పథంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యుల సమయపాలన, రోగులకు అందుబాటులో ఉండే విధానం తదితర అంశాలపై గతంలో కూడా సూచనలు చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదని అన్నారు.

గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తర్వాత అధిక సంఖ్యలో రోగులు వచ్చే ఆస్పత్రుల్లో రిమ్స్‌ కూడా ఒకటని పేర్కొన్నారు. ఇంతటి పేషెంట్‌ లోడ్‌ ఉన్న ఆస్పత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోతే రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.

వైద్యుల వేతనాలకు సంబంధించిన సమస్యలను పలువురు తన దృష్టికి తీసుకురావడంతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ఆదిలాబాద్‌కు ప్రత్యేక జీవో తీసుకురావడానికి కృషి చేశామని ఎమ్మెల్యే తెలిపారు. వైద్యులకు మెరుగైన వేతనాలు, వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ విధుల్లో నిర్లక్ష్యం కనిపిస్తే ఎలా అని ప్రశ్నించారు.

రిమ్స్‌ వసతులను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వం ఆధునిక వైద్య సదుపాయాల విస్తరణకు నిధులు కేటాయించిందని, ఆదిలాబాద్‌లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సుమారు రూ.150 కోట్ల నిధులు అందించినట్లు పాయల్ శంకర్ పేర్కొన్నారు. కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు కల్పించే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో వైద్యులు కూడా బాధ్యతగా విధులు నిర్వహించాలని అన్నారు.

రిమ్స్‌లో వైద్యులు అందుబాటులో లేకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వైద్యులు తమ పనితీరును, సమయపాలనను మెరుగుపరచుకోవాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం కొనసాగితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు చర్యలకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.

తనిఖీ సమయంలో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌తో పాటు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE