e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

ఆన్‌లైన్‌లో లారీ బుక్ చేసిన ఇద్దరి అరెస్ట్.!

ఆన్‌లైన్‌లో లారీ బుక్ చేసి మక్కజొన్నల లోడ్ దారి మళ్లింపు.. ఇద్దరి అరెస్ట్

40,435 కిలోల మక్కజొన్నలు అక్రమంగా విక్రయం.. నకిలీ నంబర్ ప్లేట్, లారీ పత్రాల వినియోగం

మన భారత్, ఆదిలాబాద్, అక్టోబర్ 24:
ఆన్‌లైన్ యాప్ ద్వారా లారీ బుకింగ్ తీసుకుని మక్కజొన్నల లోడ్‌ను నిర్దేశిత ప్రాంతానికి తరలించకుండా దారి మళ్లించి విక్రయించిన ఇద్దరు నిందితులను ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు. కేసులో నేరానికి ఉపయోగించిన లారీ, నకిలీ పత్రాలు, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానాకు చెందిన లారీ యజమాని రషీద్, రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్ షౌకత్ ఖాన్ కలిసి బ్లాక్‌బక్ (BlackBuck) ఆన్‌లైన్ యాప్ ద్వారా లారీ కిరాయిలు పొందేవారు. అయితే అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో లారీకి తప్పుడు నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసి, నకిలీ పత్రాలను ఉపయోగించి సరుకు రవాణాలో మోసం చేయాలని ఇద్దరూ ముందస్తుగా పథకం వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో అక్టోబర్ 7న ఆన్‌లైన్ యాప్ ద్వారా ఆదిలాబాద్ నుంచి కర్ణాటకకు మక్కజొన్నల లోడ్ రవాణా చేసే బుకింగ్‌ను పొందారు. అనంతరం జైనథ్ గ్రామంలో సుమారు 40,435 కిలోల మక్కజొన్నలను లారీలో లోడ్ చేశారు. రవాణా ఖర్చుల పేరుతో బుకింగ్ చేసిన రోహిత్ షిండే నుంచి ఫోన్‌పే ద్వారా రూ.50,000 కూడా తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మక్కజొన్నలను కర్ణాటకలోని నిర్దేశిత ప్రాంతానికి తరలించాల్సి ఉండగా, నిందితులు సరుకును దారి మళ్లించారు. లారీకి ఉన్న అసలు నంబర్ ప్లేట్ స్థానంలో తప్పుడు నంబర్ ప్లేట్‌ను ఉపయోగించి నాగ్‌పూర్ మీదుగా మధ్యప్రదేశ్‌కు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడ ప్రశాంత్ అనే వ్యక్తికి మక్కజొన్నలను విక్రయించి నగదు పొందినట్లు విచారణలో వెల్లడైంది.

సరుకు విక్రయం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తాన్ని లారీ రుణ వాయిదాల చెల్లింపులకు, డ్రైవర్ వాటాకు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు నిందితులు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుల గుర్తింపు

ఘటనపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు అనంతరం నిందితులు తమ మొబైల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసి పోలీసులకు చిక్కకుండా తిరిగినట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక ఆధారాలను ఉపయోగించి వారి కదలికలను గుర్తించిన పోలీసులు మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఆదిలాబాద్‌కు తరలించారు.

విచారణలో తప్పుడు నంబర్ ప్లేట్, నకిలీ లారీ పత్రాలను ఉపయోగించి మక్కజొన్నల లోడ్‌ను దారి మళ్లించి విక్రయించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో టాటా కంపెనీకి చెందిన 22 టైర్ల లారీ, నకిలీ లారీ పత్రాలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితుల వివరాలు

1. రషీద్ (37) — హరుణ్ కుమారుడు, లారీ యజమాని, హిర్వారి గ్రామం, బామాతెరి తాలూకా, మెవాట్ జిల్లా, హర్యానా.

2. షౌకత్ ఖాన్ (36) — కమ్రుద్దీన్ కుమారుడు, లారీ డ్రైవర్, జైరోలి గ్రామం, అల్వార్ జిల్లా, రాజస్థాన్.

సరుకు రవాణా కోసం ఆన్‌లైన్ యాప్‌లను ఉపయోగించే లారీ యజమానులు, వ్యాపారులు వాహనం బుక్ చేసుకునే ముందు రిజిస్ట్రేషన్ నంబర్, వాహన పత్రాలు, డ్రైవర్ వివరాలను పూర్తిగా ధ్రువీకరించుకోవాలని పోలీసులు సూచించారు. సరుకు రవాణా సమయంలో వాహనం కదలికలను కూడా పర్యవేక్షించాలని తెలిపారు.

ఈ కేసు దర్యాప్తులో ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, పోలీసు సిబ్బంది కీలకంగా వ్యవహరించినట్లు డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి తెలిపారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE