e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

అక్టోబర్ రెండో వారంలో పత్తి కొనుగోళ్లు

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా పరిశీలించిన కలెక్టర్.. ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

మన భారత్, అక్టోబర్ 4, ఆదిలాబాద్: పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా అక్టోబర్ రెండో వారంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్ల ప్రారంభ తేదీని త్వరలో ఖరారు చేసి రైతులకు ముందుగానే సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.

పత్తి కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్‌లతో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డులోని వివిధ ప్రాంతాలను పరిశీలించి రైతులకు కల్పించాల్సిన మౌలిక వసతులు, పత్తి కొనుగోళ్ల నిర్వహణ, వాహనాల రాకపోకలు, తూకం ప్రక్రియ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు.

మౌలిక వసతులపై కలెక్టర్ పరిశీలన

మార్కెట్ యార్డులో శిథిలావస్థకు చేరిన భవనాలు, తూకం యంత్రాలు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ తదితర ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. పత్తి సీజన్‌లో పెద్ద సంఖ్యలో రైతులు మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

రైతులు తమ పత్తిని విక్రయించేందుకు మార్కెట్‌కు వచ్చినప్పుడు ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మార్కెట్‌లో తూకం ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా పర్యవేక్షణ పెంచాలని, రైతులకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు తలెత్తకుండా అధికారులు, మార్కెట్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

తేమ శాతంపై రైతులు ముందుగానే అవగాహన పొందాలి

పత్తి నాణ్యత, తేమ శాతానికి సంబంధించి రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది వ్యవసాయ విస్తరణ అధికారులకు (ఏఈఓలకు) కూడా తేమ నిర్ధారణ యంత్రాలను అందుబాటులో ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. రైతులు పత్తిని మార్కెట్‌కు తీసుకురావడానికి ముందే పత్తిలోని తేమ శాతంపై తమకు ఉన్న సందేహాలను సమీపంలోని ఏఈఓల వద్ద నివృత్తి చేసుకోవాలని సూచించారు.

పత్తి కొనుగోళ్ల ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన అంశాలపై రైతులకు ముందుగానే అవగాహన కల్పిస్తే మార్కెట్‌లో అనవసరమైన ఇబ్బందులు, జాప్యాన్ని నివారించవచ్చని అధికారులు పేర్కొన్నారు.

మహారాష్ట్ర రైతులకు ప్రత్యేక జిన్నింగ్ మిల్లులు

మహారాష్ట్రలోని కిన్వట్, మహోర్ ప్రాంతాల నుంచి వచ్చే రైతుల కోసం ప్రత్యేకంగా జిన్నింగ్ మిల్లులను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఆయా మిల్లుల నిల్వ సామర్థ్యానికి అనుగుణంగానే మహారాష్ట్ర రైతులు పత్తిని తీసుకురావాలని సూచించారు. మార్కెట్‌లో ఒక్కసారిగా అధిక మొత్తంలో పత్తి చేరకుండా సమన్వయంతో వ్యవహరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

రాంపూర్ రోడ్డు మీదుగా మార్కెట్‌కు రావాలి

ప్రస్తుతం రోడ్డు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో పత్తి రైతులు, పత్తి వాహనదారులు రాంపూర్ రోడ్డు మీదుగా వ్యవసాయ మార్కెట్ యార్డుకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. మార్కెట్ పరిసరాల్లో వాహనాల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు.

పత్తి కొనుగోళ్ల సమయంలో రైతులకు అనుకూలమైన వాతావరణం కల్పించడంతో పాటు కొనుగోలు ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగేలా అధికారులు, మార్కెట్ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తారని కలెక్టర్ తెలిపారు.

రైతులకు భోజనం, తాగునీరు.. ప్రత్యేక మరుగుదొడ్లు

వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పత్తి విక్రయాల కోసం మార్కెట్‌కు వచ్చే రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతులకు భోజన వసతి, తాగునీటి సౌకర్యాలను కల్పించనున్నట్లు చెప్పారు.

ముఖ్యంగా మహిళా రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రైతులకు కొనుగోళ్లకు సంబంధించిన సమాచారం, అవసరమైన సహాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు డిజిటల్ డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

గతేడాది పత్తి కొనుగోళ్ల సమయంలో తూకం తదితర అంశాల్లో రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఈసారి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని బోరంచు శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, మార్కెట్ కమిటీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ డీఎంఓ గజానంద్, సెలెక్షన్ గ్రేడ్ విఠల్, మార్కెట్ డైరెక్టర్ సభ్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్‌చార్జి 

జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE