e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Wednesday, October 14, 2026

తెలంగాణకు నిజమైన జాతిపిత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ: ఎమ్మార్పీఎస్

మన భారత్, ఆదిలాబాద్: ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను నేటి తరానికి అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మార్పీఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని బాపూజీ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆరెల్లి మల్లేష్ మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జన్మించడం ఈ ప్రాంత ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాల నుంచి అంచెలంచెలుగా ఎదిగిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడారని తెలిపారు.

నిజాం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆయన అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తనదైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన గొప్ప త్యాగమూర్తిగా కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్‌లోని జలదృశ్యంలో ఉన్న తన ఇంటిని ఉద్యమ కార్యాలయానికి కేటాయించి ఉద్యమకారులకు అండగా నిలిచిన నిబద్ధత కలిగిన నాయకుడని కొనియాడారు. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చివరి వరకు పోరాడారని తెలిపారు. 97 ఏళ్ల వయసులో ఢిల్లీలో దీక్ష చేపట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన గళాన్ని వినిపించిన ఉద్యమ యోధుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ముఖ్యమంత్రిగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీని చేయాలని పలు సందర్భాల్లో ప్రతిపాదించిన విషయాన్ని ఆరెల్లి మల్లేష్ మాదిగ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

నీతి, నిజాయితీ, నిబద్ధత, నైతిక విలువలకు కట్టుబడి ప్రజా జీవితాన్ని కొనసాగించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. బాపూజీ కలలుగన్న సమానత్వ సమాజం కోసం ఎమ్మార్పీఎస్ తన ఉద్యమ ప్రయాణాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగతో పాటు వేణు మాదిగ, భూమన్న, పోచన్న, నాందేవ్ తదితరులు పాల్గొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘనంగా నివాళులర్పించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE