సామాజిక న్యాయం–రాజ్యాధికారం కోసం సెప్టెంబర్ 27న బహిరంగ పంచాయతీ సభ
మన భారత్, సెప్టెంబర్ 19, చిట్యాల: సామాజిక న్యాయం, రాజ్యాధికారం అనే నినాదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో, ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో నిర్వహించనున్న ‘ఎవరి కులమెంతో.. వారికి అంత వాటా’ బహిరంగ పంచాయతీ సభకు సంబంధించిన కరపత్రాలను శనివారం చిట్యాల మండల కేంద్రంలో ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27న ఉమ్మడి వరంగల్ జిల్లాలోని హనుమకొండ హంటర్ రోడ్డులో ఉన్న డీ కన్వెన్షన్ హాల్‌లో ఈ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతల రమేష్ మాట్లాడుతూ సమాజంలో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, సమాన ప్రాతినిధ్యం లభించాల్సిన అవసరం ఉందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం సామాజికంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అనేక మార్పులు చోటుచేసుకున్నప్పటికీ, ఇంకా అనేక సమస్యలు కొనసాగుతున్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, ఆర్థిక రంగాల్లో మరింత ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
సామాజిక న్యాయం సాధన కోసం ప్రజల్లో చైతన్యం పెంచాలని, రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పద్ధతుల్లో తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, కాన్షీరాం వంటి సామాజిక ఉద్యమ నేతలు సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలను చైతన్యపరిచేందుకు సెప్టెంబర్ 27న హనుమకొండలో బహిరంగ పంచాయతీ సభ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ సభకు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలతో పాటు మేధావులు, విద్యావంతులు, ఉద్యోగులు, యువత, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సామాజిక న్యాయాన్ని కోరుకునే ప్రజాస్వామ్యవాదులు హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమంలో దాసరి రాజు యాదవ్, గొర్రెల కాపరుల జిల్లా అధ్యక్షుడు, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధికార ప్రతినిధి పుల్ల మల్లయ్య, అంబేడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పర్లపల్లి వంశీ, మాదిగ జాగృతి సంఘం జిల్లా కన్వీనర్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా నాయకులు శీలపాక నాగరాజు, అశోక్, మండల ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శులు రమేష్, కుమార్, చిలుముల శశికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మీ శీలపాక రాజు,
మన భారత్ రిపోర్టర్, చిట్యాల
జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌తో పాటు నియోజకవర్గాలు, మండలాల వారీగా విలేకరులు కావలెను. ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నంబర్‌పై క్లిక్ చేయండి.
