నకిలీ పత్రాలతో ఆరు ప్లాట్ల విక్రయం.. రూ.42 లక్షల మోసం
మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూ మోసం కేసు.. ముగ్గురు అరెస్ట్, ఇద్దరు పరారీ
ఆదిలాబాద్, ఆగస్టు 18, మన భారత్: నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో ఆరు ప్లాట్లను విక్రయించి రూ.42 లక్షలు మోసం చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు మావల ఎస్‌హెచ్‌ఓ బి.డి. ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఆరు ప్లాట్ల పేరుతో మోసం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డుకు చెందిన బి. పుష్పలతకు బట్టి సావర్గాం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 3/1లో 1.05 గుంటల భూమిలో ప్లాట్లు ఉన్నట్లు చూపించారు. ఈ క్రమంలో ప్లాట్ నంబర్లు 1, 2, 11, 12, 13, 24లను ఆమెకు విక్రయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
2021 ఆగస్టు 9న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా ఆరు ప్లాట్లను కొనుగోలు చేసిన అనంతరం బాధితురాలు స్థలాన్ని పరిశీలించి హద్దులు ఏర్పాటు చేసేందుకు వెళ్లారు. అయితే అక్కడి స్థానికులు ఆ ప్లాట్లు తనవి కావని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
ప్రభుత్వ రికార్డుల పరిశీలనతో వెలుగులోకి..
దీంతో బాధితురాలు తహసీల్దార్ కార్యాలయంలో సంబంధిత భూ రికార్డులను పరిశీలించారు. రికార్డుల్లో విక్రయదారుల పేర్లు లేకపోవడంతో పాటు పత్రాలు, సంతకాలపై అనుమానాలు తలెత్తాయి. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాల ఆధారంగా ప్లాట్ల విక్రయం జరిగినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించినట్లు అధికారులు తెలిపారు.
ఆరు ప్లాట్లకు ఒక్కో ప్లాట్‌కు రూ.7 లక్షల చొప్పున మొత్తం రూ.42 లక్షలు చెల్లించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో కొంత మొత్తాన్ని చెక్కు ద్వారా, మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించినట్లు తెలిపారు.
డబ్బులు తిరిగి ఇస్తానని హామీ
ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన ఎల్టి లక్ష్మణ్ రెడ్డి తన తప్పును అంగీకరించి డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రూ.18 లక్షలు తిరిగి చెల్లిస్తానని చెప్పి, చివరకు రూ.5 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన మొత్తాన్ని చెల్లించకుండా జాప్యం చేసినట్లు బాధితురాలు ఆరోపించారు.
ముగ్గురు అరెస్ట్.. ఇద్దరు పరారీ
బాధితురాలి ఫిర్యాదు మేరకు మావల పోలీసులు క్రైమ్ నంబర్ 399/2025, సెక్షన్ 420 ర/w 34 ఐపీసీ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా A1 టోకల బుచన్న @ భుచన్న (70), A2 బొల్లి రాజు @ బొల్లి రాజన్న (47), A4 ఎల్టి లక్ష్మణ్ రెడ్డి @ లచ్చా రెడ్డి (62)లను ఆగస్టు 17, 2026న అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
కేసులో A3గా ఉన్న ఎనుగు నవీన్ కుమార్, A5గా ఉన్న బాలే నర్సింలు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు.
స్థిరాస్తుల కొనుగోలులో అప్రమత్తత అవసరం
భూములు, ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మావల పోలీసులు సూచించారు. సంబంధిత ప్రభుత్వ రికార్డులు, భూమి యాజమాన్య హక్కులు, సర్వే వివరాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర చట్టపరమైన అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే స్థిరాస్తి లావాదేవీలు నిర్వహించాలని సూచించారు. పత్రాలపై అనుమానం ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నిర్ధారించుకున్న తర్వాతే ముందుకు వెళ్లాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
