e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 17, 2026

ఆరోగ్య సేవల బలోపేతానికి కృషి ..

మన భారత్ | బోథ్

బోథ్ నియోజకవర్గ ఆరోగ్య సేవల బలోపేతానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వినతి.. మంత్రి దామోదర రాజనర్సింహకు ఆరు కీలక ప్రతిపాదనలు

హైదరాబాద్/బోథ్, జూలై 27 (మన భారత్): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గంలోని గిరిజన, గ్రామీణ మరియు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ ఆరోగ్య శాఖకు సంబంధించిన ఆరు కీలక ప్రతిపాదనలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గంలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధి, డాక్టర్ల నియామకం, అత్యవసర వైద్య సేవల విస్తరణ, డయాలసిస్ సేవలు, ట్రౌమా కేర్ సెంటర్ ఏర్పాటు వంటి అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

బోథ్ ఏరియా ఆసుపత్రికి సిబ్బంది, పరికరాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి

బోథ్‌లో రూ. కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ఏరియా ఆసుపత్రి భవనం సిద్ధంగా ఉన్నప్పటికీ, స్పెషలిస్ట్ వైద్యులు, స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు అవసరమైన వైద్య పరికరాలు లేకపోవడంతో పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభించలేకపోతున్నామని ఎమ్మెల్యే వివరించారు. వెంటనే అవసరమైన క్యాడర్ పోస్టులను మంజూరు చేసి, TSMSIDC ద్వారా వైద్య పరికరాలు అందించాలని కోరారు.

ఇచ్చొడ పీహెచ్‌సీని 30 పడకల సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్ చేయాలని డిమాండ్

మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న ఇచ్చొడ మండలంలో సుమారు 45 వేల జనాభాకు ఒకే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత్రమే ఉందని, ఇన్‌పేషెంట్ సౌకర్యం లేకపోవడంతో రోగులు 80 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇచ్చొడ పీహెచ్‌సీని 30 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేసి అదనపు సిబ్బందిని నియమించాలని కోరారు.

నెరడిగొండలో రూ.6 కోట్లతో ఇన్‌పేషెంట్ భవనం నిర్మించాలని ప్రతిపాదన

నెరడిగొండ మండలంలో గిరిజనులు, బీపీఎల్ కుటుంబాల సంఖ్య అధికంగా ఉందని, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలో ఇన్‌పేషెంట్ సౌకర్యం లేకపోవడంతో గర్భిణీలు, అత్యవసర రోగులు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. రూ.6 కోట్ల అంచనాతో 30 పడకల ఇన్‌పేషెంట్ భవనం, లేబర్ రూమ్, ఎస్‌ఎన్‌సీయూ (SNCU) ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

బోథ్, ఇచ్చొడలో డయాలసిస్ సేవలు ఏర్పాటు చేయాలని వినతి

ప్రస్తుతం బోథ్, ఇచ్చొడ ప్రాంతాలకు చెందిన 50 మందికి పైగా కిడ్నీ రోగులు ప్రతి వారం రెండు నుంచి మూడు సార్లు సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తోందని ఎమ్మెల్యే వివరించారు. దీంతో పేద రోగులు చికిత్సను మధ్యలోనే నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. బోథ్ ఏరియా ఆసుపత్రిలో నాలుగు పడకల డయాలసిస్ యూనిట్ ప్రారంభించడంతో పాటు ఇచ్చొడలో కొత్తగా నాలుగు పడకల డయాలసిస్ సెంటర్ మంజూరు చేయాలని కోరారు.

ఎన్‌హెచ్-44పై ప్రమాదాల నివారణకు ట్రౌమా కేర్ సెంటర్ అవసరం

బోథ్ నియోజకవర్గం గుండా జాతీయ రహదారి ఎన్‌హెచ్-44 వెళ్లడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్య చికిత్స అందక ప్రాణనష్టం సంభవిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నేపథ్యంలో బోథ్ ఏరియా ఆసుపత్రిలో 10 పడకల ట్రౌమా కేర్ సెంటర్, ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ సౌకర్యాలతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

బ్లాక్‌స్పాట్లలో ప్రత్యేక 108 అంబులెన్స్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

వాంకిడి, బోథ్ ఎక్స్‌రోడ్డు, సీతాగొంది, మన్నూర్–సోనాల ప్రాంతాల్లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొంటూ, ఈ ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక 108 అంబులెన్స్‌ను మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

గిరిజన ప్రాంతాల ఆరోగ్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి

ఈ ఆరు ప్రతిపాదనలు బోథ్ నియోజకవర్గ ప్రజల ఆరోగ్య భద్రతకు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల మెరుగుదలకు ఎంతో కీలకమని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన అంశాలుగా వీటిని పరిగణించి తక్షణమే పరిపాలనా అనుమతులు జారీ చేసి అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరినట్లు తెలిపారు.

మీ గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ ఆదిలాబాద్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి

జిల్లా స్టాప్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలు మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE