బీసీ మహిళను కించపరిచిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వెంటనే క్షమాపణలు చెప్పాలి
-బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మన భారత్,మొగుళ్ళపల్లి:
బీసీ మహిళను కించపరిచే విధంగా మాట్లాడిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 18 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలి ట్రస్ట్ బోర్డ్ ను ఏర్పాటు చేసిందని, అందులో ఒక బీసీ మహిళ అయినటువంటి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ ను నియామకం చేస్తే అగ్రవర్ణ నాయకులు సహించలేక బూతు పదజాలంతో తల్లి లాంటి ఈశ్వరమ్మను తిట్టడం జరిగిందని, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివ చరణ్ రెడ్డి వెంటనే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మా బీసీ తల్లిని అవమానించినందుకు, మీ నోటికి ఇష్టం వచ్చినట్లు అసభ్య పదజాలంతో మాట్లాడి బీసీ మహిళను కించపరిచినందుకు రానున్న రోజుల్లో తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. మీరు రాజకీయాలలో ఎదగాలంటే కష్టపడి ఎదగండి.. కానీ ఒక బీసీ మహిళను ఇష్టం వచ్చినట్లుగా తిడితే ఎదుగుతాననుకోవడం మూర్ఖత్వమన్నారు. ఒక యువజన సంఘంలో పనిచేస్తూ ఇలాంటి మాటలు మాట్లాడడం సిగ్గుచేటుగా భావిస్తున్నామన్నారు. మీరు మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకొని ఈశ్వరమ్మ యాదవ్ కి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే పెద్ద ఎత్తున బీసీలమంతా ఏకమై మీ ఇల్లును ముట్టడిస్తామని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగబోనియ్యమన్నారు. బీసీ మహిళలను, బీసీలను అవమానపరిచిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని బీసీ మహిళను అవమానపరిచినందుకుగాను వెంటనే పార్టీ నుండి ఆయనను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. అలాగే జిల్లాలో పని చేయుటకు నియోజకవర్గాలు, మండలాల వారీగా రిపోర్టర్స్, జిల్లా స్టాప్ రిపోర్టర్, కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
