ఎల్లారెడ్డిపల్లిలో మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
మన భారత్,మొగుళ్ళపల్లి:
భూపాలపల్లి నియోజకవర్గంలోని మొగుళ్లపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేశారని కొనియాడారు. జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా నేడు ఆయన పేరుతో విద్యాసంస్థలు కొనసాగుతున్నాయని, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఆయన ఆనాడే నిరూపించారని పేర్కొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వల్లనే నేడు ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితం గడుపుతున్నారన్నారు. మన జీవితంలోని ప్రతి అడుగులోనూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, అవకాశాల ఫలాలను అనుభవిస్తున్నామని తెలిపారు. భారతదేశపు తొలి మహిళా ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే మహిళా విద్యకు మార్గదర్శకురాలని ఎమ్మెల్యే కొనియాడారు. అట్టడుగు, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించడంతో పాటు మహిళలు చదువుకోవాలనే గొప్ప లక్ష్యంతో జ్యోతిరావు పూలేతో కలిసి దేశంలో బాలికల కోసం తొలి పాఠశాలను ప్రారంభించి చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడమే కాకుండా వారి ఆశయాలను, సిద్ధాంతాలను భావితరాలకు అందిస్తూ వారు చూపిన మార్గంలో నడవడమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని తెలిపారు.
