మన భారత్ | ఆదిలాబాద్:
రూ.1.50 కోట్లతో కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం వేగవంతం – పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా
బజార్ హత్నూర్, జూలై 2 (మన భారత్):ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న మారుమూల కొత్తపల్లి గ్రామ ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరుతోంది. వర్షాకాలంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తుల సమస్యకు శాశ్వత పరిష్కారంగా రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు డప్పులు, సంప్రదాయ వాద్యాలతో ఘన స్వాగతం పలికారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
గ్రామస్తులు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాలు గడిచినా తమ గ్రామానికి సరైన వంతెన లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారమని తెలిపారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవతో పరిష్కరించడంతో తమ గ్రామానికి నిజమైన అభివృద్ధి అందిందని, తమ చిరకాల వాంఛ నెరవేరిందని భావోద్వేగంతో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే తన ప్రధాన బాధ్యత అని అన్నారు. గతంలో ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని కొత్తపల్లి బ్రిడ్జి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, ఇతరులు చేయలేని అభివృద్ధి పనులను పూర్తి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన తర్వాత కొత్తపల్లి గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు విద్యార్థులు, రైతులు, అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
