e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

మనం పర్యావరణం కాపాడుకుందాం: డాక్టర్ బొంతలకోటి శంకరరావు

మన భారత్, గజపతినగరం:

ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో ప్రకృతి, జీవవైవిధ్య పరిరక్షణకు పిలుపు

54వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజపతినగరం బ్రహ్మకుమారీస్ సెంటర్‌లో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సు ఉత్సాహభరితంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి అవార్డు గ్రహీత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు డాక్టర్ బొంతలకోటి శంకరరావు ముఖ్య అతిథిగా, ప్రధాన వక్తగా హాజరై పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డాక్టర్ శంకరరావు మాట్లాడుతూ, ప్రకృతి, పర్యావరణం, జీవవైవిధ్యం మనుగడకు ఆధారమని, వాటి పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. పర్యావరణ పరిరక్షణ పట్ల చిన్నారుల్లో సామాజిక చైతన్యం పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. రోజురోజుకూ కనుమరుగవుతున్న జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయ రంగంలో అధికంగా వినియోగిస్తున్న రసాయన ఎరువులు, పురుగుమందులు, క్రిమిసంహారక మందుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు, సహజ కాషాయాలతో వ్యవసాయం చేయాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా భూతాపాన్ని నియంత్రించవచ్చని, గాలి, నీరు, నేల కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రజలు జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని వివరించారు.

ప్రతి శుభకార్యాన్ని మొక్కలు నాటడం ద్వారా జరుపుకోవాలని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించడం కూడా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. పర్యావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని విస్తృత స్థాయిలో మొక్కలు నాటాల్సిన అవసరం ఉందన్నారు. బాల్యం నుంచే పిల్లలకు ప్రకృతి, పరిసరాలు, జీవవైవిధ్యం పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని, వారానికి కనీసం ఒక రోజు ప్రకృతిలో గడిపే అలవాటు చేయాలని సూచించారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా సహజసిద్ధ జీవన విధానాన్ని అవలంబించాలని, భూమి వినియోగంలో ప్రకృతి అనుకూల పద్ధతులు పాటించాలని ఆయన పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన సందేశాలను పాటలు, కళారూపాల ద్వారా అందిస్తూ సభికులను ఆలోచింపజేశారు.

గజపతినగరం బ్రహ్మకుమారీస్ సెంటర్ నిర్వాహకురాలు స్వాతి అక్కయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం బ్రహ్మకుమారీస్ సభ్యులు ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ అంకితభావాన్ని చాటారు.

ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి పర్యావరణ ప్రేమికులు, బ్రహ్మకుమారీస్ అక్కయ్యలు, అన్నయ్యలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ బొంతలకోటి శంకరరావును బ్రహ్మకుమారీస్ సెంటర్ తరఫున ఘనంగా సత్కరించారు.

పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, ప్రకృతిని కాపాడటం ద్వారా భావితరాలకు సురక్షిత భవిష్యత్తును అందించవచ్చని వక్తలు పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE