బకాయి వేతనాల చెల్లింపుకు రెండో రోజు పనుల బంద్
జూన్ 9లోపు జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెకు హెచ్చరిక
మన భారత్, విజయనగరం: విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు నాలుగు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బకాయి వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రెండో రోజు కూడా పనులను నిలిపివేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ, నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారిందని, డ్వాక్రా రుణాలు, విద్యుత్ బిల్లులు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు వంటి కనీస అవసరాలకు సైతం డబ్బులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.
జీతాల చెల్లింపుపై అనేకసార్లు పంచాయతీ కార్యదర్శితో చర్చలు జరిపినా ఎలాంటి ఫలితం లేదని కార్మికులు ఆరోపించారు. ఇటీవల 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కొంత మొత్తాన్ని విడుదల చేసి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అడ్వాన్స్‌గా ఇచ్చారని, అయితే మిగిలిన నాలుగు నెలల బకాయిలు ఇప్పటికీ చెల్లించలేదని పేర్కొన్నారు.
బకాయి జీతాల గురించి ప్రశ్నిస్తే బిల్లుల ప్రక్రియకు సమయం పడుతుందని, నిబంధనల ప్రకారమే చెల్లింపులు జరుగుతాయని అధికారులు ప్రతి నెలా చెబుతూ వస్తున్నారని కార్మికులు తెలిపారు. దీంతో అనివార్య పరిస్థితుల్లో పనులను బహిష్కరించి ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు.
బుధవారం ఉదయం పంచాయతీ కార్యదర్శితో జరిగిన చర్చల్లో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ లోపు నాలుగు నెలల బకాయి జీతాలను చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు కార్మికులు తెలిపారు. అధికారుల విజ్ఞప్తి మేరకు రేపటి నుంచి విధులకు హాజరవుతామని, అయితే జూన్ 9లోపు బకాయిలు చెల్లించకపోతే జూన్ 10 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. పంచాయతీ కార్మికులు గ్రామ పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి సమయానికి వేతనాలు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు వి. లక్ష్మి, పంచాయతీ కార్మికుల సంఘం నాయకులు జి. రామకృష్ణ, భాస్కరరావు, బి. గోవింద, ఎస్. కృష్ణ, వంశీ, చిన్న లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
