e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

170 రోజుల మహా ధర్నా ఫలితం ఎక్కడ.?

మన భారత్ | ఆదిలాబాద్

 వికలాంగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఇంచార్జ్ మంత్రికి వినతి

నూతన వికలాంగుల కాలనీ, ఇంద్రమ్మ ఇళ్లలో రిజర్వేషన్ అమలు, పెన్షన్ల పునరుద్ధరణకు డిమాండ్

ఆదిలాబాద్ జిల్లాలో వికలాంగుల హక్కులు, సంక్షేమం కోసం పనిచేస్తున్న హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం సమర్పించారు. తమ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరారు.

ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో 170 రోజుల పాటు మహా ధర్నా నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు ఆశించిన ఫలితాలు కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో నూతన వికలాంగుల కాలనీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులకు అనేకసార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్యల పరిష్కారంలో పురోగతి కనిపించడం లేదని తెలిపారు. వికలాంగుల గృహ వసతి, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాల అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

ఇంద్రమ్మ ఇళ్ల మంజూరులో వికలాంగులకు తగిన ప్రాధాన్యత కల్పించలేదని సంఘం నాయకులు ఆరోపించారు. ఆదిలాబాద్ పురపాలక సంఘ పరిధిలో 49 వార్డులకు 1,351 ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు కాగా, వికలాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం 5 శాతం రిజర్వేషన్ కింద సుమారు 65 ఇళ్లు రావాల్సి ఉండగా కేవలం 35 ఇళ్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. అర్హులైన వికలాంగులు ఎంపిక కాకపోవడానికి సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.

అదేవిధంగా, పురపాలక సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల కోటాలో కేటాయించిన ఐదు దుకాణాల లీజు కాలపరిమితి ముగిసిన వెంటనే తిరిగి టెండర్లు నిర్వహించి వికలాంగులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

2014లో హెల్త్ కార్డుల జాబితా ఆధారంగా తొలగించిన వికలాంగుల పెన్షన్లను ఎటువంటి షరతులు లేకుండా వెంటనే పునరుద్ధరించాలని కోరారు. అలాగే ఆదిలాబాద్ పురపాలక సంఘంలోని మెప్మా విభాగంలో పేపర్ నోటిఫికేషన్ లేకుండా కమ్యూనిటీ ఆర్గనైజర్ పోస్టు భర్తీ చేశారనే ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరిపి, అర్హత కలిగిన వికలాంగ అభ్యర్థికి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

వికలాంగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని హ్యాండీక్యాప్ హెల్పింగ్ వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఇమన్, ప్రధాన కార్యదర్శి ఫైసల్ అహ్మద్ కోరారు.

ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షురాలు తార ఉష అన్న, జాయింట్ సెక్రటరీ ఫేక్ ఖలీల్, కోశాధికారి సయ్యద్ సాజిద్, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, జిల్లా వ్యాప్తంగా పలువురు దివ్యాంగులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

గొంటి ముక్కుల ,ప్రసాద్ రిపోర్టర్ ,మన భారత్ .

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE