మన భారత్, బోథ్:
బోథ్ నియోజకవర్గంలో అభివృద్ధి దిశగా కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టేందుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విజ్ఞప్తితో ఈనెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జరగనుంది. రైతులు, విద్యార్థులు, సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు ప్రాంత అభివృద్ధికి కొత్త దిశను చూపనున్నాయి.
ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అనేక సార్లు అసెంబ్లీలో ప్రస్తావించి, సంబంధిత అధికారులకు వినతిపత్రాలు అందజేసి, పట్టుదలతో ఈ ప్రాజెక్టులను సాధించినట్లు స్థానిక నాయకులు తెలిపారు. రైతుల సంక్షేమం, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం ప్రధాన లక్ష్యంగా ఈ ప్రణాళికలు అమలవుతున్నాయని పేర్కొన్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు – రైతులకు వరంగా మారనున్న నీటిపారుదల
రైతుల సాగుకు నీటి కొరతను నివారించేందుకు పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. పిప్రి (బజార్ హత్నూర్)లో రూ.50.70 కోట్లతో, బుగ్గారం (నెరడిగొండ)లో రూ.43.73 కోట్లతో, పొచ్చర (తేజాపూర్) ప్రాంతంలో రూ.46.64 కోట్లతో, సుంకిడి (సిరికొండ)లో రూ.42 కోట్లతో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది.
విద్యా రంగంలో భారీ పెట్టుబడులు
పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. అదనంగా పొచ్చర ప్రాంతంలో ఐటీఐ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు తెలిపారు.
విద్యుత్ సదుపాయాల విస్తరణ
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ధన్నూర్ (బోథ్), కుప్టి (నెరడిగొండ), కుచులపూర్ (తలమడుగు) ప్రాంతాల్లో నూతన విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయబడ్డాయి. ఇవి ప్రారంభమైతే విద్యుత్ సరఫరా మెరుగుపడి, వ్యవసాయ రంగానికి ఊతమిస్తాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.
బోథ్‌కు ఫైర్ స్టేషన్ మంజూరు
ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకొని బోథ్ ప్రాంతానికి ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం విశేషం. ఇది అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలను అందించేందుకు ఉపయోగపడనుంది.
ఈ ప్రాజెక్టులన్నీ అమలులోకి వస్తే బోథ్ నియోజకవర్గం అభివృద్ధిలో ముందడుగు వేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరగనున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి
