e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, November 27, 2026

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. బాలల రక్షణకు 1098 హెల్ప్‌లైన్‌పై వివరించిన చైల్డ్ హెల్ప్‌లైన్ AID ప్రతినిధులు

బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థకు స్వస్తి పలకాలి

గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన.. బాలల రక్షణకు 1098 హెల్ప్‌లైన్‌పై వివరించిన చైల్డ్ హెల్ప్‌లైన్, AID ప్రతినిధులు

మన భారత్, తలమడుగు, నవంబర్ 26: బాలల హక్కులను కాపాడటంతో పాటు బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని చైల్డ్ హెల్ప్‌లైన్, యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (AID) ప్రతినిధులు సూచించారు. పిల్లలకు సురక్షితమైన వాతావరణం కల్పించడం, వారి హక్కులపై అవగాహన పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం అర్లి (కె) మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మిక వ్యవస్థ నివారణ, గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ (AID) – JRC ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైల్డ్ హెల్ప్‌లైన్ కేస్ వర్కర్ ఎ. శ్రీకాంత్, AID ప్రతినిధి ఎస్. కిరణ్ పాల్గొని పలు అంశాలను వివరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాల్య వివాహాలు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని, చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వల్ల విద్య, ఆరోగ్యం, వ్యక్తిగత అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయని తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టం ప్రకారం బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు నిండకముందు వివాహాలు చేయడం చట్టవిరుద్ధమని వివరించారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, పిల్లలను పనుల్లోకి పంపకుండా పాఠశాలలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు.

అనంతరం గుడ్ టచ్ – బ్యాడ్ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. తమ శరీరానికి సంబంధించిన వ్యక్తిగత హద్దులను గుర్తించాలని, ఎవరైనా అసౌకర్యంగా లేదా అసభ్యంగా ప్రవర్తించినప్పుడు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని సూచించారు. పిల్లలు తమకు ఎదురయ్యే సమస్యలను దాచుకోకుండా విశ్వసనీయమైన పెద్దలతో పంచుకోవాలని తెలిపారు.

బాలలపై వేధింపులు, బాల్య వివాహాలు, బాల కార్మికత్వం వంటి సమస్యలు ఎదురైనప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని, బాలల రక్షణ కోసం అందుబాటులో ఉన్న 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ సేవలను వినియోగించుకోవాలని వివరించారు. విద్యార్థులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు ఇతర బాలల హక్కుల పరిరక్షణకు కూడా తోడ్పడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు సరసన్ మోహన్ రెడ్డి, ఉపాధ్యాయులు ఆడే విట్టల్, కలవల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమైన సహాయ నంబర్లు:
– చైల్డ్ హెల్ప్‌లైన్: 1098
– పోలీస్ అత్యవసర సేవలు: 112

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE