e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలి

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేయాలి
– జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్
– ఘాట్ల వారీగా, శాఖల వారీగా సమగ్ర ప్రతిపాదనలు రూపొందించాలి
– ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలి
జగిత్యాల కలెక్టరేట్, నవంబర్ 25, మన భారత్ :
జగిత్యాల జిల్లాలో 2027లో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ తాత్కాలిక ఏర్పాట్ల ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ బుడుమజ్జి సత్యప్రసాద్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) మినీ కాన్ఫరెన్స్ హాల్ లో గోదావరి పుష్కరాలు–2027 తాత్కాలిక ఏర్పాట్లపై జిల్లా శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ పుష్కరాలకు జిల్లాలోని వివిధ ఘాట్లకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పార్కింగ్, రవాణా, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, వసతి తదితర అన్ని అంశాలపై ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. భక్తులు జిల్లాలోకి ప్రవేశించినప్పటి నుంచి పుష్కర స్నానాలు, దేవాలయ దర్శనం, భోజనం, విశ్రాంతి అనంతరం తిరిగి వెళ్లే వరకు ప్రతి దశలో అవసరమైన సౌకర్యాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ ఘాట్‌లోనూ తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, భక్తుల భద్రత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి శాఖ తమ పరిధిలో చేపట్టాల్సిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, అదనంగా అవసరమయ్యే వసతులు, భూములు, సామగ్రి, వాహనాలు, సిబ్బంది వివరాలతో సమగ్ర ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. దేవాదాయ శాఖ భక్తుల క్యూలైన్లు, నీడ షెడ్లు, ప్రసాదం, అన్నదానం, పిండప్రదానం, పాదరక్షల భద్రత, లాకర్లు, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. పోలీస్ శాఖ ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, వాహనాల రాకపోకలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, వాచ్ టవర్లు, లాస్ట్ అండ్ ఫౌండ్ కేంద్రాలు, మహిళల భద్రత, అత్యవసర మార్గాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. అన్ని శాఖాధిపతులు ఘాట్ వారీగా అవసరాల అంచనా, తాత్కాలిక పనుల ఆర్థిక అంచనాలు, సిబ్బంది అవసరాలు, భూముల వివరాలు, ఇతర శాఖలతో సమన్వయ అంశాలను నిర్దేశిత ప్రొఫార్మాలో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అధికారులు సంబంధిత శాఖల సిబ్బందితో కలిసి ప్రతిపాదనలపై తక్షణమే కసరత్తు ప్రారంభించాలని, అవసరమైన వారికి ఈ నెల 27 వరకు గడువు ఉంటుందని పేర్కొన్నారు. పనుల అంచనాల్లో తాత్కాలిక నిర్మాణాలు, సామగ్రి కొనుగోలు లేదా అద్దె, రవాణా, సిబ్బంది వేతనాలు, విద్యుత్, ఇంధనం, 12 రోజుల నిర్వహణ వ్యయంతో పాటు పుష్కరాల అనంతరం నిర్మాణాల తొలగింపు, భూముల పునరుద్ధరణ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాలు–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన సేవలు అందించేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జగిత్యాల ఆర్డీఓ మధు సూదన్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏఓ కిషన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE