e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

ట్రైనీ అధికారుల శిక్షణ విజయవంతం..

క్షేత్రస్థాయి పర్యటనతోనే ప్రజా సమస్యలు, పాలనా వ్యవస్థపై సమగ్ర అవగాహన

ట్రైనీ అఖిల భారత సర్వీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచన – ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం ముగింపు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 06: ప్రభుత్వ పాలనా వ్యవస్థ, ప్రజల జీవన పరిస్థితులు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమగ్ర అవగాహన పొందేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శిక్షణలో భాగంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న వాస్తవ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ట్రైనీ అఖిల భారత సర్వీస్ అధికారులకు సూచించారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు రోజులపాటు కొనసాగిన అఖిల భారత సర్వీస్ అధికారుల క్షేత్రస్థాయి శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ముగింపు సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ట్రైనీ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

IAS, IPS, IFoS తదితర అఖిల భారత సర్వీస్‌లకు చెందిన మొత్తం 18 మంది ట్రైనీ అధికారులను క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు కేటాయించారు. అక్టోబర్ 31న జిల్లాకు చేరుకున్న అధికారులు నవంబర్ 1 నుంచి 6వ తేదీ వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పర్యటించారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

శిక్షణలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, ఐసీడీఎస్ కేంద్రాలు, ఉపాధి సంబంధిత కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరును అధ్యయనం చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సేవల అమలులో ఉన్న పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ, అధికారులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిర్ణయాలు తీసుకునే సమయంలో క్షేత్రస్థాయి అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కార్యాలయాల్లో అందే నివేదికలతో పాటు క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటించడం ద్వారా ప్రజల అవసరాలు, సమస్యలు, స్థానిక పరిస్థితులను స్పష్టంగా అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు ఏ మేరకు చేరుతున్నాయి, ప్రభుత్వ సేవల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటనే అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు.

ప్రజలతో నేరుగా మాట్లాడటం, వారి సమస్యలను తెలుసుకోవడం, వివిధ శాఖల పనితీరును క్షుణ్ణంగా అధ్యయనం చేయడం ద్వారా భవిష్యత్తులో సమర్థవంతమైన, పారదర్శకమైన ప్రజాపాలన అందించేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ వివరించారు. క్షేత్రస్థాయి పర్యటనలో పొందిన అనుభవాలను భవిష్యత్తు పరిపాలనా బాధ్యతల్లో అన్వయించుకోవాలని ట్రైనీ అధికారులకు సూచించారు.

ఈ ముగింపు సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రవీందర్ రాథోడ్, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, ట్రైనీ అఖిల భారత సర్వీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE