e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

ఖాజీపేట పేదల భూముల హక్కులను కాపాడాలి

22 ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలి – మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్

మన భారత్, ఖాజీపేట:

దశాబ్దాలుగా ఖాజీపేటలో నివాసం ఉంటూ, కష్టపడి చిన్నచిన్న ఇళ్లను నిర్మించుకున్న పేద కుటుంబాల భూముల హక్కులను పరిరక్షించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 22 నుంచి 24 ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేద కుటుంబాలకు న్యాయం చేయకుండా, వారి నివాసాలపై వివాదాలు సృష్టించడం సరికాదని పేర్కొన్నారు. అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఖాజీపేటలో స్థానిక పేద కుటుంబాలకు మద్దతుగా నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌తో కలిసి వినోద్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాంతంలో పేదలకు నివాస హక్కులు కల్పించాలనే లక్ష్యంతో గతంలో విద్యార్థి దశ నుంచే అనేక ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించినట్లు గుర్తుచేశారు. సుమారు 40 ఏళ్ల క్రితమే ఖాజీపేట జంక్షన్‌లో ప్రజల సౌకర్యార్థం మంచి బస్‌స్టాండ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేసినట్లు తెలిపారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదలు ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉండేందుకు అవకాశం కల్పించారని, అప్పటి నుంచి క్రమంగా కుటుంబాలు స్థిరపడి తమ శ్రమతో చిన్నచిన్న ఇళ్లను నిర్మించుకున్నాయని వివరించారు. ఇన్నేళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాల పరిస్థితులను, వారి జీవనాధారాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఇప్పుడు భూముల విషయంలో ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమని అభిప్రాయపడ్డారు.

భూభారతి రికార్డులపై సమగ్ర విచారణ జరపాలి

కొత్తగా రూపొందించిన భూభారతి రెవెన్యూ రికార్డుల్లో ఖాజీపేటలో నివాసం లేని కొందరి పేర్లపై పట్టాలు నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. అదే సమయంలో ఎన్నో ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న పేద కుటుంబాల పేర్లు, వారి అనుభవం, హక్కులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ భూములు ప్రభుత్వానికి సంబంధించినవా, ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయా, వాటి అసలు యాజమాన్య హక్కులు ఎవరికి చెందుతాయనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

ఈ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సంబంధిత భూములకు సంబంధించిన ప్రొవిజనల్ జాబితాను పరిశీలించి, అర్హులైన పేద కుటుంబాల వివరాలను సేకరించి, వారి హక్కులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు వెల్లడించారు.

అవసరమైతే హైకోర్టులో న్యాయపోరాటం

పేద కుటుంబాలకు న్యాయం జరిగే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే న్యాయపోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తమ పార్టీ న్యాయవాదుల బృందంతో రెవెన్యూ చట్టాలు, భూముల రికార్డులను సమగ్రంగా పరిశీలింపజేసి, అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. 22 ఏళ్లకు పైగా నివాసం ఉంటున్న కుటుంబాలను నిరాశ్రయులను చేసే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.

పేదల నివాస హక్కులు, వారి భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు అతీతంగా న్యాయం జరగాలని పేర్కొంటూ, అర్హులైన కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదల హక్కుల పరిరక్షణలో బీఆర్ఎస్ పార్టీ, గులాబీ జెండా ఎల్లప్పుడూ ముందుంటాయని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మాజీ కుడా చైర్మన్ యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE