e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

రక్షణ రంగంలో భారత్‌ను ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దుదాం

తెలంగాణను రక్షణ ఉత్పత్తుల తయారీకి అతిపెద్ద పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మన భారత్ ప్రతినిధి:

రక్షణ రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే శక్తివంతమైన అగ్రగామి దేశంగా తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశోధనా సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రక్షణ అవసరాల కోసం విదేశాల నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తులు తయారు చేయడంతోపాటు వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణను దేశ రక్షణ పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.

త్వరలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ‘రక్షా ఎక్స్‌పో 2026’ కర్టెన్ రైజర్‌ను ప్రారంభించి, అధికారిక లోగోను ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనికతకు అనుగుణంగా త్వరలోనే ‘ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2.0’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే రూపొందించిన ప్రణాళికలను పారిశ్రామికవేత్తలు మరింత విస్తరించాలని కోరారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరమైనా అందించేందుకు సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. రక్షణ రంగంతోపాటు అంతరిక్ష పరిశోధనలు, ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధస్సు, డ్రోన్ సాంకేతికత వంటి రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని వివరించారు.

2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గతేడాది తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేసినట్లు ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా 2.5 శాతానికి పైగా ఉండగా, జీడీపీలో రాష్ట్రం ఐదు శాతం వాటాను అందిస్తోందన్నారు. 2047 నాటికి ఈ వాటాను పది శాతానికి పెంచాలన్నది తమ లక్ష్యమని తెలిపారు.

ఈ లక్ష్య సాధనలో రక్షణ ఉత్పత్తుల తయారీ, ఏరోస్పేస్ పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వినూత్న ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలకు ప్రభుత్వం అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పారు.

భవిష్యత్తు యుద్ధాల్లో సాంకేతికతే కీలకం

భవిష్యత్తులో యుద్ధాల స్వరూపం గణనీయంగా మారనుందని, డ్రోన్లు, రోబోట్లు, కృత్రిమ మేధస్సుతో పనిచేసే వ్యవస్థలు రక్షణ రంగంలో కీలకంగా మారనున్నాయని సీఎం అన్నారు. ఈ మార్పులకు అనుగుణంగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రక్షా ఎక్స్‌పోను రక్షణ రంగంలోని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఒకే వేదికపై సమావేశమై ఆలోచనలు పంచుకునే, భాగస్వామ్యాలు ఏర్పరుచుకునే అంతర్జాతీయ వేదికగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు.

రక్షణ పరిశ్రమలకు హైదరాబాద్ అనుకూల కేంద్రం

భారత రక్షణ వ్యవస్థలో హైదరాబాద్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉందని సీఎం పేర్కొన్నారు. నగరంలో అనేక కీలక పరిశోధనా సంస్థలు ఉన్నాయని, భారత సైన్యం, వైమానిక దళాలకు సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక కేంద్రాలు ఇక్కడి నుంచి పనిచేస్తున్నాయని వివరించారు. సముద్రతీరం లేని తెలంగాణ రాష్ట్రం సైతం భారత నౌకాదళానికి అవసరమైన సేవలు అందిస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో నిర్మిస్తున్న అత్యల్ప పౌనఃపున్యాల (వీఎల్‌ఎఫ్‌) నౌకాదళ రాడార్ కేంద్రాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ప్రముఖ సంస్థల ప్రతినిధుల హాజరు

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డీఆర్‌డీఓ, హెచ్‌ఏఎల్, బీడీఎల్, మిధాని, టాటా సంస్థలు, ఎయిర్‌బస్, సాఫ్రాన్, స్కైరూట్, లాక్‌హీడ్ మార్టిన్, భారత్ ఫోర్జ్, ఎల్‌అండ్‌టీ తదితర సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

భారత్ ఫోర్జ్ సీఎండీ బాబా ఎన్. కల్యాణి, స్కైరూట్ సీఈఓ పవన్ కుమార్ చందన, డీఆర్‌డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ డి. సతీష్ రెడ్డి, అమెరికా కాన్సులేట్ జనరల్ ప్రతినిధి లారా విలియమ్స్ సహా పలువురు ప్రముఖులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వచ్చే డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రెండో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లోనూ పాల్గొనాలని సీఎం పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. రక్షణ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు, తయారీని ప్రోత్సహించడం ద్వారా తెలంగాణను దేశ పారిశ్రామిక ప్రగతిలో కీలక భాగస్వామిగా నిలబెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE