e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Saturday, October 24, 2026

సామాజిక సేవలో భాగంగా కొందరికైనా ఉచిత వైద్యం అందించాలి..

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా వైట్ కోట్ సెర్మనీ

రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 24 (మన భారత్ ప్రతినిధి): వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు భవిష్యత్తులో ఉత్తమ వైద్యులుగా ఎదిగి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. వైద్య వృత్తిని కేవలం ఉపాధిగా కాకుండా సమాజ సేవకు ఒక గొప్ప అవకాశంగా భావించాలని సూచించారు. సామాజిక బాధ్యతలో భాగంగా కనీసం కొందరికైనా ఉచిత వైద్య సేవలు అందించాలని పిలుపునిచ్చారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో శనివారం నిర్వహించిన వైట్ కోట్ సెర్మనీకి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా ఎస్పీ మహేష్ బి. గితె ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వైద్య విద్యార్థులకు వైట్ కోట్లు అందజేసి అభినందించారు. కార్యక్రమ నిర్వాహకులు కలెక్టర్, ఎస్పీలను శాలువాలతో సత్కరించారు.

సేవాభావంతో వైద్య వృత్తిని కొనసాగించాలి

ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సమాజంలో విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. వైద్య విద్యలో ప్రవేశం పొందడానికి విద్యార్థులు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా వైద్య విద్య అభ్యసించే అవకాశం లభిస్తుందని వివరించారు. ప్రతి విద్యార్థి విజయం వెనుక తల్లిదండ్రుల కృషి, ప్రోత్సాహం ఎంతో ఉంటుందని పేర్కొన్నారు.

వైద్యుల సేవలు సమాజానికి అత్యంత అవసరమని అన్నారు. గర్భిణులు, చిన్నారులు, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు వైద్యులు ఓర్పుతో, బాధ్యతాయుతంగా సేవలు అందించాలని సూచించారు. విద్యార్థులు తాము ఎంచుకున్న వైద్య విభాగాల్లో నైపుణ్యాన్ని పెంపొందించుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

వైద్య వృత్తిలో ఆర్థిక ప్రయోజనాలతో పాటు మానవతా విలువలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పేదలు, ఆర్థికంగా వెనుకబడిన వారికి వీలైనంత మేర ఉచిత వైద్య సేవలు అందించడం ద్వారా ఆత్మసంతృప్తి లభిస్తుందని తెలిపారు. వైద్య సేవల్లో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. విధి నిర్వహణలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ వైద్యులు తమ ఆరోగ్యం, ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

హాస్టల్ నిర్మాణ పనులు వేగవంతం

ప్రభుత్వ వైద్య కళాశాల అభివృద్ధి పనులపై కలెక్టర్ మాట్లాడుతూ.. కళాశాల భవనం, బాలికలు, బాలుర హాస్టళ్ల నిర్మాణ పనులను పలుమార్లు పరిశీలించినట్లు తెలిపారు. ప్రస్తుతం బాలికల హాస్టల్ వినియోగంలోకి వచ్చిందని వెల్లడించారు. వైద్య కళాశాల, బాలుర హాస్టల్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

వైద్య విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సేవాభావం, మానవీయ విలువలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, వైస్ ప్రిన్సిపాల్ నిర్విష, తహసీల్దార్ మహేష్ కుమార్, వైద్యులు, కళాశాల సిబ్బంది, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 8341991420

User Name : user_name : Oggu mahesh chandra

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE