మన భారత్ | తలమడుగు
పురుగుమందుల పిచికారీలో భద్రతా చర్యలు తప్పనిసరి..
ఆశా వర్కర్లకు అవగాహన సదస్సు
తలమడుగు, జూలై 7 (మన భారత్): రైతులు పురుగుమందుల పిచికారీ సమయంలో తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని, గ్రామీణ స్థాయిలో ఈ విషయంపై అవగాహన కల్పించడంలో ఆశా వర్కర్లు కీలక పాత్ర పోషించాలని వైద్య అధికారులు సూచించారు. తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ)లో ఆరోగ్య శాఖ సహకారంతో కేశవాపూర్ ఎఫ్‌పీసీఎల్ (FPCL), డబ్ల్యూడబ్ల్యుఎఫ్ (WWF) స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఆశా వర్కర్లకు ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హరీష్, వైద్యాధికారి డాక్టర్ వాణిశ్రీ, స్టాఫ్ నర్సులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్ సాదిక్ పాషా రైతులకు పురుగుమందుల పిచికారీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా వర్కర్లకు సమగ్ర అవగాహన కల్పించారు.
పురుగుమందుల వినియోగానికి ముందు వాటి లేబుల్‌పై ఉన్న సూచనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. పిచికారీ చేసే సమయంలో గ్లౌజులు, మాస్క్, కళ్లజోడు, బూట్లు, పూర్తి చేతుల దుస్తులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలు (PPE) తప్పనిసరిగా ధరించాలని వివరించారు.
అలాగే గాలి వేగంగా వీచే సమయంలో పిచికారీ చేయరాదని, పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పిచికారీ జరుగుతున్న ప్రాంతానికి దూరంగా ఉండేలా చూడాలని సూచించారు. పిచికారీ సమయంలో తినడం, తాగడం, పొగ త్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలని, పని పూర్తయిన వెంటనే చేతులు, ముఖాన్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని చెప్పారు.
ఖాళీ పురుగుమందుల డబ్బాలను ఇంటి అవసరాలకు ఉపయోగించకుండా సురక్షితంగా పారవేయాలని, పిచికారీ చేసిన పొలంలోకి లేబుల్‌లో సూచించిన సమయం పూర్తయ్యాకే ప్రవేశించాలని తెలిపారు. పురుగుమందుల ప్రభావంతో తల తిరగడం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఈ భద్రతా సూచనలను చేరవేసి ప్రమాదాలను నివారించడంలో ఆశా వర్కర్లు చురుకైన పాత్ర పోషించాలని సమావేశంలో పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ కోఆర్డినేటర్ సాదిక్ పాషా, పీయూ మేనేజర్ జీవనే చంద్రకాంత్, అంకితతో పాటు ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
