మన భారత్ | ఆదిలాబాద్
గంజాయి రహిత ఆదిలాబాద్ లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ..
రిమ్స్ డి-అడిక్షన్ సెంటర్‌ను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, జూలై 7 (మన భారత్): గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిగా అరికట్టడంతో పాటు వ్యసనానికి బానిసైన వారిని తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మంగళవారం స్థానిక రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తున్న డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించి అక్కడి వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డి-అడిక్షన్ సెంటర్‌లో అందించనున్న వైద్య సేవలు, మానసిక కౌన్సెలింగ్, పునరావాస కార్యక్రమాలపై వైద్య బృందంతో సమీక్ష నిర్వహించిన ఎస్పీ, వ్యసనగ్రస్తులు పూర్తిగా మత్తు పదార్థాల బానిసత్వం నుంచి బయటపడేలా సమగ్ర ప్రణాళికతో సేవలు అందించాలని సూచించారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, గంజాయి సరఫరా, రవాణా, విక్రయాలపై పోలీసులు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే చట్టపరమైన చర్యలతో పాటు గంజాయికి బానిసైన వ్యక్తులకు వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్, పునరావాసం కల్పించడం కూడా సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. శిక్షతో పాటు సంస్కరణ కూడా సమానంగా ముఖ్యమని, అందుకే పోలీస్ శాఖ వైద్య శాఖతో సమన్వయం చేసుకుంటూ డి-అడిక్షన్ కార్యక్రమాలను విస్తృతంగా అమలు చేస్తున్నట్లు వివరించారు.
జిల్లా వ్యాప్తంగా మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులను గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వచ్ఛందంగా డి-అడిక్షన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందించే ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. చికిత్స పూర్తయిన తర్వాత కూడా వారు మళ్లీ వ్యసనాల బారిన పడకుండా నిరంతర కౌన్సెలింగ్, పర్యవేక్షణ నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పిల్లల ప్రవర్తనలో అసాధారణ మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు లేదా వైద్య అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
ప్రజల సహకారంతోనే గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లాను నిర్మించగలమని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రిమ్స్ డైరెక్టర్ డా. రాథోడ్ జై సింగ్, డి-అడిక్షన్ సెంటర్‌కు చెందిన సైకాలజిస్టులు, వైద్యులు, టూ టౌన్ సీఐ కె. నాగరాజు, సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
