e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 16, 2026

E20 పెట్రోల్‌తో పాత వాహనాలకు మైలేజ్ షాక్.?

2023కు ముందు వాహనాల్లో ఇంధన సామర్థ్యం తగ్గుతోందని సర్వే వెల్లడి

మన భారత్, న్యూఢిల్లీ:
దేశవ్యాప్తంగా అమలులోకి వస్తున్న E20 పెట్రోల్ వినియోగంపై వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా 2023కు ముందు తయారైన వాహనాల్లో మైలేజ్ తగ్గిపోతుండటంతో పాటు ఇంజిన్ సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయని తాజాగా నిర్వహించిన లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేలో పాల్గొన్న వాహనదారుల్లో ప్రతి ఇద్దరిలో ఒకరు గత తొమ్మిది నెలల కాలంలో తమ వాహన మైలేజ్ గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

సర్వే వివరాల ప్రకారం.. E20 పెట్రోల్ వినియోగం ప్రారంభమైన తర్వాత వాహనాల పనితీరులో మార్పులు కనిపిస్తున్నాయని అనేక మంది అభిప్రాయపడ్డారు. సుమారు 29 శాతం మంది వాహనదారులు ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ లైన్లలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా పాత మోడల్ బైక్‌లు, కార్లలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందని వాహనదారులు చెబుతున్నారు.

అధికారికంగా E20 పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్‌లో కేవలం 1 నుంచి 6 శాతం వరకు మాత్రమే తగ్గుదల ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని వాహనదారులు పేర్కొంటున్నారు. కొంతమంది వినియోగదారులు తమ వాహనాల్లో ఇంధన వినియోగం మరింత పెరిగిందని, మునుపటి కంటే తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణ పరిరక్షణ, దిగుమతి ఇంధనాలపై ఆధారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దశలవారీగా E20 ఇంధనాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ ఇంధనంలో 20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్ మిశ్రమంగా ఉంటుంది. అయితే పాత వాహనాలు E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా లేకపోవడం వల్ల మెకానికల్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

వాహనదారులు తమ వాహనాల మాన్యువల్‌ను పరిశీలించి E20 ఇంధనానికి అనుకూలత ఉందో లేదో తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైతే సర్వీస్ సెంటర్లలో సాంకేతిక పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. మరోవైపు E20 ఇంధనంపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE