వీబీ–జి రామ్ జీ’ చట్టాన్ని తిరస్కరించాలి 

Published on

‘వీబీ–జి రామ్ జీ’ చట్టాన్ని తిరస్కరించాలి  ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ యథాతథ అమలే పేదల రక్షణ : సీఎం రేవంత్ రెడ్డి

మన భారత్, తెలంగాణ:

గ్రామీణ ప్రాంత నిరుపేదల ఉపాధి హామీకి తీవ్ర విఘాతం కలిగించే *మ‘వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవికా మిషన్ (గ్రామీన్) (VB–G RAMG) చట్టం–2025’ ను నిర్ద్వందంగా తిరస్కరించాలని ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించి, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (MGNREGA) యథాతథంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ శాసనసభ ద్వారా డిమాండ్ చేశారు.

VBGRAMG చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు, కొత్త చట్టం వల్ల పేదలకు కలిగే నష్టాలను సవివరంగా వివరించి తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పార్టీలకు అతీతంగా అందరూ ఈ తీర్మానానికి మద్దతుగా నిలవాలని కోరారు.

వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్ గార్ చట్టం పేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధిపై ఎక్కువగా ఆధారపడిన మహిళలు, బలహీన వర్గాల మహిళలకు ఈ చట్టం అన్యాయం చేస్తుందని చెప్పారు. డిమాండ్ ఆధారంగా పనులు కల్పించే పాత ఉపాధి హామీ పథక ఆత్మను కొత్త నిబంధనలు పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

2006 ఫిబ్రవరి 2న అమలులోకి వచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రమ దోపిడీని తగ్గించే లక్ష్యంతో రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ఈ పథకం ద్వారా కనీసం 100 రోజుల ఉపాధి, కనీస వేతనం హామీగా లభించిందన్నారు. గడిచిన 20 ఏళ్లలో రాష్ట్రంలో ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారిలో సుమారు 90 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలవారని, అందులో 62 శాతం మహిళలేనని తెలిపారు.

కొత్త చట్టంలో డిమాండ్ ఆధారిత విధానాన్ని తొలగించడం పేదల హక్కులకు విరుద్ధమని సీఎం మండిపడ్డారు. పరిమిత పనిదినాల కేటాయింపులతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని, మహిళా సాధికారతకు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుందని చెప్పారు. పాత చట్టంలో వంద శాతం కేంద్రం నిధులు అందిస్తే, కొత్త చట్టంలో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రాలు భరించాలన్న నిబంధన రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం మోపుతుందని విమర్శించారు.

మహాత్మాగాంధీ పేరును తొలగించడం గాంధీ గారి స్ఫూర్తిని నీరుగార్చినట్లేనని పేర్కొంటూ, ఆయన పేరును తిరిగి చట్టంలో చేర్చాలని శాసనసభ డిమాండ్ చేస్తోందన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పథకం కింద 266 రకాల పనులు ఉన్నాయని, కొత్త చట్టంలో భూమి అభివృద్ధి వంటి శ్రమాధారిత పనులను తొలగించడం వల్ల చిన్న, సన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారని హెచ్చరించారు.

వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం విధించడం భూమిలేని కూలీలకు అన్యాయమని, ఉపాధి హామీ పథకం సంవత్సరం పొడవునా కొనసాగాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. ఉపాధిని హక్కుగా గుర్తించి తీసుకొచ్చిన ఈ చట్టం వల్లే వలసలు తగ్గాయని, పాలమూరు ప్రాంత వలసల చరిత్ర అందరికీ తెలిసిన విషయమేనని గుర్తు చేశారు.

కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టం అమలైతే మళ్లీ పట్టణాల వైపు వలసలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ఉద్దేశాలు, లక్ష్యాలను కాపాడేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు.

Latest articles

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....

10 నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

కేరళలో అవయవదానం ద్వారా మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం మన భారత్, కేరళ: కేరళలో జరిగిన విషాదకర రోడ్డుప్రమాదం ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో...

More like this

గుబిడి భజన పోటీల్లో 12వ వార్డు భజన మండలి ప్రతిభ..

మన భారత్, ఆదిలాబాద్: గుబిడి గ్రామంలో నిర్వహించిన భజన పోటీలలో 12వ వార్డుకు చెందిన శ్రీ రమా సహిత సత్యనారాయణ...

గురు రవిదాస్ జయంతి వేడుకల్లో సుకుమార్ పెట్కులేకు ఘన సన్మానం

మన భారత్, నాందేడ్: నాందేడ్ జిల్లా కేంద్రంలో విశ్వగురు సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సాహిత్య సమ్మేళన...

ఆదిలాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అనూష బండారి ఎన్నిక

ఉత్కంఠకు తెర – స్వతంత్ర అభ్యర్థికి విస్తృత మద్దతు మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ ఎన్నికల ఉత్కంఠకు తెరపడింది....