e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Sunday, November 29, 2026

రైతులను మోసం చేసిన చాందిని సీడ్స్ కంపెనీ యజమాని అరెస్ట్..

జైనథ్ మండల రైతులను మోసం చేసిన చాందిని సీడ్స్ కంపెనీ యజమాని అరెస్ట్

ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి, క్వింటాలుకు రూ.7 వేల కొనుగోలు అంటూ నమ్మించి మోసం
రైతుకు చెల్లించాల్సిన రూ.1.78 లక్షల బకాయి ఎగవేత.. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసుల గాలింపు

మన భారత్, జైనథ్, నవంబర్ 28:

జైనథ్ మండలంలోని రైతులకు అధిక పెట్టుబడి, పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నమ్మించి మోసాలకు పాల్పడిన చాందిని సీడ్స్ కంపెనీ యజమానిని జైనథ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మొక్కజొన్న సాగు చేసే రైతులను లక్ష్యంగా చేసుకుని కంపెనీ యజమాని తన ఏజెంట్లతో కలిసి ఈ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

జైనథ్ గ్రామానికి చెందిన మేడిపల్లి హనుమంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జైనథ్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.275/2026 కింద BNS సెక్షన్లు 318(4), 316(5) ప్రకారం కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చికటి శ్రీనివాసరావు 2013లో చాందిని సీడ్స్ పేరుతో మొక్కజొన్న విత్తనాల వ్యాపార సంస్థను ప్రారంభించాడు. ఏజెంట్లు చిట్యాల సుభాష్ రెడ్డి, అదేపు సాయికృష్ణల సహకారంతో జైనథ్ మండల రైతులను సంప్రదించి, ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి అందిస్తామని, పండించిన మొక్కజొన్న పంటను క్వింటాలుకు రూ.7 వేల చొప్పున కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు విత్తనాలు అందించి, పంట చేతికొచ్చిన తర్వాత కొనుగోలు చేసి కొంత నగదు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ క్రమంలో ఫిర్యాదుదారుడైన హనుమంత్ రెడ్డికి చెందిన ఆరు ఎకరాల సాగుకు రూ.60 వేల పెట్టుబడి అందించారు. ఆయన పండించిన 46 క్వింటాళ్ల మొక్కజొన్నకు సంబంధించి మొత్తం రూ.3,28,300 చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.1,50,000 మాత్రమే చెల్లించి, మిగిలిన రూ.1,78,300 బకాయిని చెల్లించకుండా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డుల (CDR) ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించిన పోలీసులు ఏలూరు జిల్లా చటపర్రులో ఈ నెల 27న చికటి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నవంబర్ 28న అధికారికంగా అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో నిందితులుగా ఉన్న ఏజెంట్లు A2 చిట్యాల సుభాష్ రెడ్డి, A3 అదేపు సాయికృష్ణ ప్రస్తుతం పరారీలో ఉండగా, వారి కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. రైతులకు చెల్లించాల్సిన పంట డబ్బులు ఎగవేసి మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ వివరాలను జైనథ్ ఎస్సై పి. గౌతమ్ వెల్లడించారు.

మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ , ఆదిలాబాద్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE