e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

ప్రపంచ దేశాలకే ఆదర్శం మన భారత రాజ్యాంగం..

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ విలువలను పరిరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత : తహసీల్దార్ వసంతారావు, సీఐ సతీష్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల, నవంబర్ 26, మన భారత్ :

భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కల్పించిందని, ఇంతటి గొప్ప రాజ్యాంగాన్ని కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని తహసీల్దార్ వసంతారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ అన్నారు. భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజును పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం 77వ రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నె యుగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తహసీల్దార్ వసంతారావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగ గొప్పతనాన్ని, అంబేద్కర్ చేసిన కృషిని స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచిన గొప్ప లిఖితపూర్వక రాజ్యాంగమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తూ స్వేచ్ఛాయుత జీవనానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు రాజ్యాంగం బలమైన పునాది వేసిందన్నారు.

భారత రాజ్యాంగంలో 395 అధికరణలు, 8 షెడ్యూళ్లు, 22 భాగాలు ఉండేలా రూపొందించారని, రాజ్యాంగ రచనలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనలో ఆయన రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు విశేష కృషి చేసి దేశానికి దిశానిర్దేశం చేసే అద్భుతమైన రాజ్యాంగాన్ని అందించారని వివరించారు.

రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులు, ఓటు హక్కు, సమానత్వం, స్వేచ్ఛతో పాటు సామాజికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ల రూపంలో అవకాశాలు లభించాయని తెలిపారు. ప్రతి పౌరుడు తన హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించుకోవాలని సూచించారు. రాజ్యాంగంలోని విలువలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు.

ముఖ్యంగా యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య విలువల పట్ల అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. సమాజంలో కులమత భేదాలు లేకుండా ఐక్యత, సోదరభావం పెంపొందినప్పుడే రాజ్యాంగ లక్ష్యాలు నెరవేరుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీవో బి. శ్రీకాంత్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, జాతీయ అవార్డు గ్రహీత పుల్ల మల్లయ్య, వార్డు సభ్యులు పుల్ల నిర్మల, సతీష్ కుమార్, తౌటం నవీన్, శనిగరపు మొగిలి, సంఘం నాయకులు, అంబేద్కర్ వాదులు కట్కూరి మొగిలి, గురుకుంట్ల కిరణ్, పాముకుంట్ల చందర్, గడ్డం సదానందం, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కళాశాల విద్యార్థులు, సిబ్బంది, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE