e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, November 26, 2026

ఎల్లారెడ్డిపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం..

ఎల్లారెడ్డిపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం.

అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు బిపేట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అదేవిధంగా మండలంలోని వివిధ దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాల నాయకులతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టిఆర్ఎస్ పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య, ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ నంది కిషన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బండారి బాలరెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశ ఐక్యత, సమగ్రత, ప్రజాస్వామ్య విలువలకు పునాది అని పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ప్రతి పౌరుడు తన ప్రాథమిక విధులను కూడా గుర్తెరిగి నడుచుకోవాలని సూచించారు.

1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును పురస్కరించుకొని ప్రతి ఏటా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని తెలిపారు. రాజ్యాంగ రూపకర్తలను గౌరవించుకోవడంతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకునే గొప్ప సందర్భమిదని అన్నారు. పౌరుల్లో రాజ్యాంగ విలువలపై అవగాహన పెంపొందించేందుకు 2015 నుంచి నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ప్రపంచంలోని అనేక దేశాలు పాలనాపరమైన సమస్యలు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక సూత్రాలు, ప్రజాస్వామ్య విలువలతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక సమరసతకు దోహదపడుతున్నాయని తెలిపారు.ప్రతి పౌరుడు రాజ్యాంగం నిర్దేశించిన మౌలిక సూత్రాలను పాటిస్తూ దేశ ఐక్యతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను దుర్వినియోగం చేయకుండా హక్కులతో పాటు బాధ్యతలను కూడా గుర్తించాలని సూచించారు. దేశమే మొదటి ప్రాధాన్యత అనే భావనతో ప్రతి ఒక్కరూ దేశభక్తిని, రాజ్యాంగం పట్ల విశ్వసనీయతను కలిగి ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యుడు బిపేట రాజ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షేక్ గౌస్ బాయి, మాజీ ఏఎంసీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రాంరెడ్డి, డైరెక్టర్ ఇమామ్ బాయి, అబ్జల్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు పుల్లయ్యగారి తిరుపతి గౌడ్, సంజీవ్ రెడ్డి, కస్తూరి ప్రవీణ్ రెడ్డి, రాజు, మొక్కల ప్రేమికుడు దుంపెన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker + Short News
Breaking News LIVE