e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Tuesday, November 24, 2026

గంజాయి రహిత ఆదిలాబాద్ నిర్మాణానికి పోలీసుల ప్రత్యేక కార్యాచరణ డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్

గంజాయి రహిత ఆదిలాబాద్ నిర్మాణానికి పోలీసుల ప్రత్యేక కార్యాచరణ
డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
వ్యసనగ్రస్తులకు వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్‌తో పునరావాసం
మత్తు పదార్థాల సమాచారమిస్తే నగదు రివార్డులు

మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24:

జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టి గంజాయి రహిత ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి, వారికి వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్ అందించడం ద్వారా తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

మంగళవారం ఆదిలాబాద్‌లోని డి-అడిక్షన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, చికిత్సా విధానాలు, వ్యసనగ్రస్తులకు అందించే కౌన్సెలింగ్, పునరావాస సేవలపై వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు. చికిత్స పొందుతున్న వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకుని, మరింత మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి సరఫరా, విక్రయం, రవాణాపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదే సమయంలో గంజాయికి, ఇతర మత్తు పదార్థాలకు బానిసైన వ్యక్తులను గుర్తించి శాస్త్రీయ పద్ధతుల్లో వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్ అందించడం ద్వారా వ్యసనం నుంచి బయటపడేలా చేయడం అత్యంత ముఖ్యమన్నారు.

శిక్షతో పాటు సంస్కరణ కూడా సమాజానికి అవసరమని, ఈ ఉద్దేశంతోనే జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డి-అడిక్షన్ చికిత్సా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు వివరించారు. జిల్లావ్యాప్తంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు అలవాటుపడిన వ్యక్తులను గుర్తించి, వారి కుటుంబ సభ్యుల సహకారంతో స్వచ్ఛందంగా డి-అడిక్షన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

చికిత్స అనంతరం కూడా ప్రత్యేక పర్యవేక్షణ

వ్యసనానికి బానిసైన వ్యక్తులు చికిత్స పొందిన తర్వాత తిరిగి మత్తు పదార్థాల వినియోగం వైపు వెళ్లకుండా నిరంతర కౌన్సెలింగ్, పర్యవేక్షణ చేపట్టనున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. బాధితులకు కుటుంబ సభ్యుల సహకారం, సమాజం నుంచి ప్రోత్సాహం అందితే వారు వ్యసనాల నుంచి బయటపడి ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించగలరని తెలిపారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

ముఖ్యంగా యువత గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సూచించారు. విద్య, క్రీడలు, మంచి అలవాట్లపై దృష్టి సారించి భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు గమనించినట్లయితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పోలీసులకు లేదా వైద్య అధికారులకు సమాచారం అందించాలని కోరారు.

వ్యసనాల నుంచి బయటపడేందుకు క్రీడా సామాగ్రి అందజేత

డి-అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా వ్యసనగ్రస్తులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకునేలా జిల్లా ఎస్పీ క్రీడా సామాగ్రిని అందజేసి ప్రోత్సహించారు. క్రీడలు, వ్యాయామం వంటి కార్యక్రమాలు మానసిక ఉల్లాసానికి, ఆరోగ్య పరిరక్షణకు దోహదపడతాయని పేర్కొన్నారు.

సమాచారం అందిస్తే నగదు రివార్డులు

జిల్లాలో గంజాయి సాగు, సరఫరా, విక్రయం, ఇతర మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అందించే వారికి నగదు రివార్డులు అందజేస్తామని ఎస్పీ ప్రకటించారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజల సహకారంతోనే గంజాయి రహిత ఆదిలాబాద్ జిల్లాను నిర్మించడం సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, సీఐ బి.డి. ప్రేమ్ కుమార్, టూ టౌన్ ఎస్ఐ ఎస్. జీవన్ రెడ్డి, నూతన శిక్షణా డీఎస్పీలు సామ సాత్విక, సిద్ధోజి రాణి, ఆర్. ఆదిత్య, నాతి యువిక మిత్ర, డి-అడిక్షన్ కేంద్రం సిబ్బంది చంద్రశేఖర్ రెడ్డి, దేవేంద్ర, కల్పన, వైద్యులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE