e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Monday, November 23, 2026

జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు హామీ

జీవో నెం. 25 సవరణపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు హామీ

ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి – కలువల శంకర్

మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 11,

రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పరిరక్షణతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు జీవో నెంబర్ 25ను సవరించాలని కోరుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఆదిలాబాద్‌కు చెందిన ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కలువల శంకర్ విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 25 అమలుతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థుల అభ్యసన సామర్థ్యంపై పడుతున్న ప్రభావాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా చర్చిస్తానని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చినట్లు కలువల శంకర్ తెలిపారు.

ప్రభుత్వ విద్యారంగంలో చేపట్టిన చర్యలకు అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా అభినందించారు. 4,200 పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించడం, సుమారు 65 వేల మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం, 11 వేల డీఎస్సీ నియామకాలు చేపట్టడం, 25 వేలకు పైగా ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం వంటి చర్యలు ప్రశంసనీయమన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, స్టూడెంట్ కిట్, బ్రేక్‌ఫాస్ట్ పథకం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఏర్పాటు వంటి కార్యక్రమాలు ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

సింగిల్ టీచర్ పాఠశాలల్లో బోధనకు ఇబ్బందులు

జీవో నెంబర్ 25 కారణంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల నిర్వహణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయని విజ్ఞాపన పత్రంలో వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,793 పాఠశాలలు సింగిల్ టీచర్‌తో, సుమారు 7 వేల పాఠశాలలు ఇద్దరు ఉపాధ్యాయులతో కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లో 21 నుంచి 60 మంది వరకు విద్యార్థులు ఉన్నప్పటికీ, ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులే ఐదు తరగతులకు సంబంధించిన 18 సబ్జెక్టులను బోధించడంతో పాటు ప్రధానోపాధ్యాయుల బాధ్యతలను కూడా నిర్వహించాల్సి వస్తోందన్నారు.

దీంతో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందించడం కష్టమవుతోందని, ప్రాథమిక స్థాయిలో విద్యార్థులు సాధించాల్సిన కనీస అభ్యసన సామర్థ్యాలపై ప్రభావం పడుతోందని వివరించారు.

ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు బడులకు వలస

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి తరగతికి ప్రత్యేక ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు లేకపోవడం, అన్ని పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్య, ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకపోవడం వల్ల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలు సైతం తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సుమారు 20 కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు పాఠశాలలకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిస్తేనే విద్యార్థుల ప్రవేశాలు పెరిగి ప్రభుత్వ విద్యావ్యవస్థ బలోపేతమవుతుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికి ప్రతిపాదించిన ప్రధాన డిమాండ్లు

జీవో నెంబర్ 25ను సమీక్షించి అవసరమైన సవరణలు చేయాలని, గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న ప్రాథమిక పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయాలని సూచించారు. అదే సమయంలో విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో తరగతికి ఒక ఉపాధ్యాయుడిని, ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించాలని కోరారు.

సింగిల్ టీచర్, ఇద్దరు ఉపాధ్యాయులతో కొనసాగుతున్న పాఠశాలల్లో బోధనకు అంతరాయం కలగకుండా డిసెంబర్ నెలలోనైనా విద్యా వాలంటీర్లను తక్షణమే నియమించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించడంతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అలాగే ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడు తరగతులకు ఏడుగురు ఉపాధ్యాయులను నియమించాలని, వారిలో ఒకరు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కలువల శంకర్ విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 25 సవరణపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని మంత్రి హామీ ఇవ్వడం ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ దిశగా సానుకూల పరిణామమని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE