e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Friday, October 23, 2026

అమరవీరుల సంస్మరణలో 853 యూనిట్ల రక్తదానం

పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మెగా రక్తదాన శిబిరం.. స్వయంగా రక్తదానం చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్

మన భారత్, ఆదిలాబాద్: అక్టోబర్ 23:

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసులు, యువత, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 853 యూనిట్ల రక్తాన్ని సేకరించి రిమ్స్ బ్లడ్ బ్యాంకుకు అందజేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు.

మెగా రక్తదాన శిబిరాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేసి పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఎస్పీ అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు.

అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ..

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ అక్టోబర్ 21న నిర్వహించే పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు అమరవీరుల సేవలను ప్రజలకు తెలియజేయడంతో పాటు, వారి త్యాగాలను స్మరించుకునేలా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

గతంలో పోలీసులు చేసిన ప్రాణత్యాగాల ఫలితంగానే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ఒక కారణమైందని ఎస్పీ పేర్కొన్నారు. అమరవీరుల సేవలను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు.

ప్రజల రక్షణలో పోలీసుల నిరంతర సేవలు

పోలీసులు వృత్తిరీత్యా ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ తెలిపారు. రాత్రింబవళ్లు, పండుగలు, ప్రత్యేక సందర్భాల్లోనూ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజల ధన, ప్రాణ, మాన రక్షణకు పోలీసులు 24 గంటలు సేవలందిస్తున్నారని చెప్పారు.

జిల్లా అభివృద్ధికి సంఘవిద్రోహ శక్తులు అడ్డంకులుగా మారకుండా పోలీసు యంత్రాంగం నిరంతరం పనిచేస్తోందన్నారు. మారుమూల గ్రామాల వరకు అభివృద్ధి, భద్రతా వాతావరణం విస్తరించేందుకు పోలీసులు అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ప్రజలు–పోలీసుల మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు.

రక్తదానం.. ప్రాణదానంతో సమానం

అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో ఉండటం ఎంతో కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ఇతర వైద్య అవసరాల సమయంలో రక్తం ప్రాణాలను కాపాడే కీలక వనరుగా నిలుస్తుందని తెలిపారు. అందువల్ల ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు.

రక్తదాన శిబిరంలో మహిళలు కూడా ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేయడం ప్రత్యేకంగా నిలిచింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటారని అధికారులు తెలిపారు.

భారీగా పాల్గొన్న పోలీసులు, ప్రజలు

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల అధికారులు, సిబ్బందితో పాటు ప్రజలు, యువజన సంఘాల ప్రతినిధులు, ఎన్జీవోలు, వైద్యులు, రిమ్స్ బ్లడ్ బ్యాంకు సిబ్బంది, ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదనపు ఎస్పీలు పి. మౌనిక ఐపీఎస్, బి. సురేందర్ రావు, డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, పట్టణ సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు తదితరులు శిబిరాన్ని పర్యవేక్షించారు.

మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరవీరుల సంస్మరణను సామాజిక సేవతో అనుసంధానిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పెద్ద సంఖ్యలో రక్తం సేకరించడం జరిగిందని పేర్కొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE