e-paper
హోం ఆరోగ్యం క్రైం సినిమా క్రీడలు బిజినెస్
✖ Close Home Privacy Policy Disclaimer About Us Terms & Conditions
Thursday, October 15, 2026

భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

భూసమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

78 గ్రామాల్లో భూ రీ-సర్వే పనులు.. మండలానికి రెండు బృందాలతో వేగవంతం

రైతులు తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

మన భారత్, ఆదిలాబాద్:అక్టోబర్ 15,

భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గురువారం తాంసి మండలం బండల్ నాగాపూర్ గ్రామంలో భూభారతి, భూ రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ ఆర్.ఎస్. చిత్రూతో కలిసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రీ-సర్వే నిర్వహిస్తున్న తీరును అధికారులు, సర్వేయర్లను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో భూ రికార్డుల వివరాలు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులు, సర్వే ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే పనులను సమర్థవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

జిల్లాలోని అన్ని మండలాల్లో భూ రీ-సర్వే పనులను వేగవంతం చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన 11 రోవర్లకు అదనంగా జిల్లా ఫండ్‌ నుంచి మరో 8 రోవర్లను కొనుగోలు చేసి మండల సర్వేయర్లకు అందించినట్లు వెల్లడించారు. ప్రతి మండలంలో రెండు బృందాలను ఏర్పాటు చేసి సర్వే ప్రక్రియ కొనసాగిస్తున్నామని చెప్పారు.

జిల్లా వ్యాప్తంగా క్యాడస్ట్రల్ మ్యాప్స్ ఉన్న, లేని గ్రామాలను కలిపి మొత్తం 78 గ్రామాల్లో భూ రీ-సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. భూముల హద్దులు, సర్వే వివరాలు స్పష్టంగా నమోదు కావడం ద్వారా భవిష్యత్‌లో భూములకు సంబంధించిన వివాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కుటుంబాల మధ్య భూ వివాదాలు, చుట్టుపట్టదారి సమస్యలు, నక్షాబాటకు సంబంధించిన తగాదాలు వంటి సమస్యలకు రీ-సర్వే ద్వారా పరిష్కార మార్గం లభిస్తుందని అన్నారు.

భూ వివరాలను కచ్చితంగా నమోదు చేసి, భూములకు సంబంధించిన మ్యాపింగ్‌ను ఆధునిక సాంకేతికతతో పూర్తి చేయడం ద్వారా రైతులకు, భూ యజమానులకు మరింత స్పష్టత ఏర్పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూదార్ కార్డు, ల్యాండ్ పార్సెల్ మ్యాప్ వంటి వివరాలు భవిష్యత్‌లో భూ హక్కులు, సరిహద్దులకు సంబంధించిన అంశాల్లో ఉపయోగపడతాయని తెలిపారు.

తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యం

యాసంగి సాగు నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సోయాబీన్ పంట తొలగించిన అనంతరం ఎక్కువ కాలం తీసుకునే జొన్న వంటి పంటల వైపు వెళ్లకుండా తక్కువ కాలపరిమితిలో చేతికి వచ్చే పంటలను సాగు చేయాలని సూచించారు.

ప్రత్యేకంగా శెనగ, పెసర్లు, మినుములు, నువ్వులు వంటి తక్కువ నీటి వనరులతో సాగు చేసుకునే పంటలను రైతులు పరిశీలించాలని తెలిపారు. దీంతో పొలాలు ఎక్కువ కాలం ఖాళీగా ఉండకుండా పంటల సాగు కొనసాగుతుందని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను కొంతవరకు తగ్గించుకోవచ్చని సూచించారు.

నీటి సౌకర్యంతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ నీటిపారుదల వసతులు కలిగిన రైతులు ఉద్యాన పంటల వైపు కూడా దృష్టి సారించాలని అన్నారు. బంతి పూలు, టమాట వంటి పంటలను ప్రత్యామ్నాయంగా సాగు చేస్తే ప్రభుత్వ పథకాల కింద లభించే సబ్సిడీలను వినియోగించుకోవడంతో పాటు ఆదాయ అవకాశాలను పెంచుకోవచ్చని తెలిపారు.

పంటల మార్పిడిపై ప్రగతిశీల రైతులు అవగాహన పెంచుకొని, స్థానిక పరిస్థితులు, నీటి లభ్యత, మార్కెట్‌ అవకాశాలను పరిగణనలోకి తీసుకుని సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు.

రామాలయంలో ప్రత్యేక పూజలు

భూ రీ-సర్వే పనుల పరిశీలన అనంతరం బండల్ నాగాపూర్ గ్రామంలోని రామాలయాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాత ప్రతిమను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ల్యాండ్ ఏడీ సర్వే ప్రభాకర్, తహసీల్దార్ మధుసూదన్, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, నాయకులు సోను, గ్రామస్థులు, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Cell Number : cell_number : 9573391945

User Name : user_name : Gontimukkula prasad

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Bottom Navigation + Breaking Ticker
Breaking News LIVE